తెలంగాణ క్రికెట్ హక్కులకు ప్రజాఉద్యమం: టీసీఏ
హైదరాబాద్, జూన్ 7: చట్టబద్ధత లేకున్నా టీజీ20 లీగ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరును నిరసిస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపింది.
తెలంగాణ క్రికెట్ హక్కుల కోసం నిర్వ హించిన ప్రజా ఉద్యమంలో టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి మాట్లాడుతూ హెచ్‌సీఏ నిర్వహించతలపెట్టిన టీజీ20 లీగ్ కు చట్టబద్దత లేదని, రూల్ 30 ప్రకా రం హెచ్‌సీఏ గవర్నింగ్ కౌన్సిల్ బీసీసీఐ నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలనీ గుర్తు చేశారు. ఇవేమీ పాటించకుండా స్వయంప్రకటిత గవర్నింగ్ కౌన్సిల్ బీసీసీఐ అనుమతి వచ్చిందని ప్రజలను మోసగిస్తోందన్నారు.
దీని పర్యవసానంగా రూల్ 31ప్రకారం హెచ్‌సీఏ గుర్తింపు రద్దు, అందులో పాల్గొనే ఆట గాళ్లు, అధికారులు, సంస్థలను నిషేధం ఎదుర్కొంటారనీ హెచ్చరించారు. టీజీ20 లీగ్‌లో ఆడబోతున్న తిలక్ వర్మ, సిరాజ్‌లకు కూడా ఈ రూల్ 31 వర్తిస్తుందని గురువారెడ్డి స్పష్టం చేశారు. టీజీ20 లీగ్ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్ ఫిర్యాదులు, అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం, దర్యాప్తు సం స్థలు సమగ్ర విచారణ జరపాలని కోరారు.
మాజీ శాసన సభ్యులు, టీసీఏ కో చైర్మన్ యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ తెలంగాణ క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టీసీఏ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో వేలాది మంది యువ క్రికెటర్ల భవిష్యత్తు ప్రమాదం లో పడిందని, ప్రతిభ ఉన్నా అవకాశాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.శాట్స్ మాజీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జిల్లా క్రికెటర్లకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు.






