ఒకవైపు పచ్చదనం.. మరోవైపు ఎండు ముఖం..
అలంపూర్, జూలై 15: ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఉపాధి హామీ పథకం కింద నాటిన మొక్కల సంరక్షణ లేక బూడిదవుతున్నాయి. అలంపూర్ చౌరస్తా నుంచి ఉండవల్లి వైపు వెళ్ళే ప్రధాన రహదారి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఒకవైపు మొక్కలు పచ్చగా పెరిగి కనిపిస్తుండగా, మరోవైపు పూర్తిగా వాడిపోయి కనిపించడం అధికారుల పర్యవేక్షణపై అనుమానాలకు తావిస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు మొక్కలకు నిప్పు పెట్టి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఘటన జరిగిన తర్వాత కూడా దెబ్బతిన్న మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటడం, వాటి సంరక్షణ చేపట్టడంలో సంబంధిత అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఒకే రహదారిపై ఒకవైపు పచ్చదనం, మరోవైపు ఎండిన మొక్కలు కనిపించడం ఉపాధి హామీ పనుల అమలు, పర్యవేక్షణలో లోపాలను బహిర్గతం చేస్తోందని ప్రజలు అంటున్నారు.






