సర్దుకుంటున్న పోలీస్..!

11-09-2026 | 05:25am
  1. అవినీతి ఆరోపణల ఉచ్చులో అధికారి..!
  2. రేషన్ బియ్యం వ్యవహారంపై ఇప్పటికే విచారణ
  3. కిందిస్థాయి వ్యక్తుల ద్వారా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు
  4. ఆడియోలు, నగదు లావాదేవీల స్క్రీన్షాట్లతో బట్టబయలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబరు 10 (విజయక్రాంతి):జిల్లాలోని ఓ పోలీస్ అధికారిపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాం శంగా మారాయి. రేషన్ బియ్యం (Ration rice) అక్రమ రవాణా వ్యవహారంతో  సదరు అధికారి పాత్ర ఉందంటూ ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. తాజాగా తనపై చర్యలు తప్పవనే ప్రచారం నేపథ్యంలో పరిధిలోని అక్రమ వ్యాపారుల నుంచి కిందిస్థాయి వ్యక్తుల ద్వారా వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

‘సార్ వెళ్తున్నారు’ అంటూ వసూళ్లు?

అక్రమంగా సరుకు తరలించే వ్యాపారుల వద్దకు కిందిస్థాయి వ్యక్తి ద్వారా “సార్ వెళ్తున్నారు.. ఇక ఉండరు” అంటూ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని లావాదేవీలు సదరు వ్యక్తి ఫోన్కు నేరుగా చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించినవిగా చెబుతున్న ఆడియో రికార్డులు, డబ్బులు పంపిన స్క్రీన్షాట్లు బయటకు రావడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది. గతంలో రేషన్ బియ్యం వ్యవహారంలోనూ ఆరోపణలు

సదరు అధికారిపై రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. పట్టుకున్న సరుకు, వాహనాలను విడుదల చేసి, అనంతరం మధ్యవర్తుల ద్వారా సరుకును విక్రయించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందించినట్లు తెలుస్తోంది.

పక్షం రోజులైనా చర్యలు ఏవీ?

అధికారిపై ఫిర్యాదులు, విచారణకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సైతం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

వేటా.. బదిలీయా?

తనపై చర్యలు లేదా బదిలీ తప్పదనే ప్రచారం నేపథ్యంలో సదరు అధికారి ముందుగానే “సర్దుకునే” పనిలో పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కిందిస్థాయి వ్యక్తి ద్వారా వసూళ్లు సాగినట్లు చెబుతున్న ఆధారాలు బయటకు రావడంతో పోలీస్ శాఖలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇంతటి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చడంతో పాటు, ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు