1 March, 2026 | 2:31 AM

పోలీసుల అదుపులో దొంగ నోట్ల ముఠా

01-03-2026 12:37 AM

12 మంది అరెస్ట్

రూ.5,98,500 విలువైన ఫేక్ కరెన్సీ స్వాధీనం 

లక్షెట్టిపేట, ఫిబ్రవరి 28(విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో కొంతకాలంగా ప్రజలను, వ్యాపారులను ఆందోళనకు గురిచేసిన దొంగ నోట్ల వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. నెల రోజులుగా సూపర్ మార్కెట్లు, మద్యం దుకాణాలు, హోల్‌సేల్ షాపుల్లో రూ.500 దొంగ నోట్లను చలామణి చేస్తూ వచ్చిన గ్యాంగ్‌ను లక్షేట్టిపేట పోలీసులు పట్టుకున్నా రు.

మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కేసులో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా రూ. 5,98,500 విలువైన ఫేక్ కరెన్సీను స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్ల రవాణాకు ఉపయోగించిన మూడు కార్లను సీజ్ చేశారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు.దొంగ నోట్ల గ్యాంగ్‌ను పట్టుకున్న లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్‌ఐ గోపతి సురేష్  ఏసీపీ అభినందించారు. ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

అరెస్టయిన వారిలో కానగంటి క్రాంతి (రియల్ ఎస్టేట్, లక్షెట్టిపేట), గడిగొప్పుల రవీందర్ (ఆటో డ్రైవర్, లక్షెట్టిపేట), తాండ్ర ప్రకాష్ (ఆర్కే6, శ్రీరాంపూర్), కొంక మధుకర్ (వెంకట్రావుపేట), సుంకే సురేష్ (గోదావరిఖని), కామిని అనిల్ (సుల్తానాబాద్), రామ్ నాయక్ (బేకరీ, లక్షెట్టిపేట), నగునూరి రాము (లక్షెట్టిపేట), దేవబోయిన సంపత్ కుమార్ ( బెజ్జంకి), కాడుమండ్ల తిరుపతి (జెండా వెంకటాపూర్), గోల్ల కుమారస్వామి (పెరకపల్లి), బండారి సత్యనారాయణ (రంగపేట)లు ఉన్నారు.