6 June, 2026 | 1:17 AM

అక్రమ స్పా సెంటర్లపై పోలీసుల ఉక్కుపాదం

06-06-2026 12:00 AM
  1. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 113 స్పా సెంటర్లలో తనిఖీలు, 46 కేసులు నమోదు
  2. అనుమతులు లేకుండా డార్క్ రూముల నిర్వహణ 
  3. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు 
  4. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి

ఎల్బీనగర్, జూన్  5 : అక్రమ కార్యకలాపాలు, అనధికారిక క్రాస్ మసాజ్ సేవలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్వోటీ బృందాలతో కలిసి మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని స్పా సెంటర్లపై సమగ్ర తనిఖీలు చేపట్టారు. 113 సెంటర్లు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 46 సెంటర్ల నిర్వాహకులు, మేనేజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ప్రజా భద్రత ఉత్తర్వులు, చట్టపరమైన నిబంధనలు, నిర్వహణ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎల్బీనగర్ లోని క్యాంపు కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సుమతి ప్రత్యేక సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్పా సెంటర్లలో నిబంధనలు ఉల్లంఘన..

  చాలావరకు స్పా సెంటర్లు అవసరమైన అనుమతులు, అప్రూవల్స్ లేకుండా, నిర్దేశిత నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారు. పారదర్శక తలుపులు లేని డార్క్ రూమ్స్ లు,  చాలా సెంటర్లలో మూసివేయబడిన, బాగా కనిపించని విభజన గదులు నిర్మించి, పారదర్శక గాజు తలుపులు లేకుండా భద్రతా నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్ ఐడీ ప్రూఫ్ సేకరణలో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలను సేకరించడం లేదు, సక్రమంగా రికార్డులను నిర్వహించడం లేదని గుర్తించారు. స్పా సెంటర్ సూచించే డిస్ప్లే బోర్డులు లేకుండా సెంటర్లు ఉన్నాయి. 

జోన్ల వారీల తనిఖీల వివరాలు

ఎల్బీనగర్ జోన్‌లోని ఐదు పోలీస్ స్టేషన్ పరిధిలోని 47 సెంటర్లలో తనిఖీలు నిర్వహించి, 17 కేసులు నమోదు చేశారు. ఉప్పల్ జోన్ లోని ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలోని  30 సెంటర్లలో తనిఖీలు నిర్వహించి, 11 కేసులు నమోదు చేశారు. మల్కాజిగిరి డివిజన్ లోని ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలోని 17 సెంటర్లలో తనిఖీలు నిర్వహించి, 7 కేసులు నమోదు చేశారు. కంటోన్మెంట్ జోన్ లో ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని 19 సెంటర్లలో తనిఖీలు నిర్వహించి, 11 కేసులు నమోదు చేశారు. 

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా, అనధికారంగా, అక్రమంగా నడుస్తున్న స్పా సెంటర్ల గురించి సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా కమిషనరేట్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని ప్రజలను పోలీస్ కమిషనర్ సుమతి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు, పోలీసులు, ఎస్వోటీ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.