తాగిన మైకంలో పోలీసు వాహనాల చోరీ!
- రోడ్ల మీద చక్కర్లు కొట్టిన దుండగులు
- మేడ్చల్ జిల్లా చర్లపల్లి, కరీంనగర్ పీఎస్‌ల వాహనాలుగా గుర్తింపు
- మేడ్చల్ జిల్లాలో నిందితుడి అరెస్టు
- కరీంనగర్‌లో దొరకని నిందితుడి ఆచూకీ!
- పోలీసుల నిర్లక్ష్యంతోనే వాహనాలు చోరీ?
కరీంనగర్/మేడ్చల్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): పోలీసుల నిర్లక్ష్యం(Police negligence)తో వారి వాహనాలు చోరీ(Vehicle theft) అయ్యాయి. మేడ్చల్ జిల్లా(Medchal District) చర్లపల్లి(Charlapalli), కరీంనగర్(Karimnagar) పీఎస్‌లకు చెందిన వాహనాలను దుండగులు తాగిన మైకంలో చోరీ చేసి ఎంచక్కా రోడ్ల మీద చక్కర్లు కొట్టి, వదిలేసి పారిపోయారు. మేడ్చల్ జిల్లాలో నిందితుడి అరెస్టు చేయగా.. కరీంనగర్‌లో నిందితుడి ఆచూకీ దొరకలేదని తెలుస్తున్నది. మేడ్చల్ జిల్లా పరిధిలో ముగ్గురు యువకులు వరంగల్(Warangal) వెళ్లడానికి దుండిగల్ వద్ద తమ కారులో రింగ్ రోడ్డు(Ring Road) ఎక్కారు.
వీరిని ఓవర్‌టేక్ చేసి ఓ పోలీసు వాహనం వెళ్లింది. పోలీసు వాహనం అడ్డదిడ్డంగా, వేగంగా వెళ్తుండటంతో వారికి అనుమానం వచ్చింది. వాహనం దగ్గరికి వెళ్లి చూడగా అందులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. అతను కూడా సివిల్ డ్రెస్‌లో ఉన్నాడు. వీరిని చూసి పోలీసు వాహనం వేగం మరింత పెంచాడు. దీంతో వీరు ఆ వాహనాన్ని అనుసరిస్తూనే 112 నంబర్‌కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. తనను అనుసరిస్తున్నారని, దొరికిపోతానని భావించిన దొంగ కీసర దాటిన తర్వాత వాహనాన్ని వదిలి పరారయ్యాడు.
పోలీసులు వచ్చి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వాహనం చర్లపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందినదిగా తేలింది. దొంగను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తాగిన మైకంలో ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా పోలీసు వాహనాన్ని దొంగ ఎత్తుకుపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
వాహనం దొంగిలించిన విషయం కూడా పోలీసులకు తెలియదు. పోలీసు వాహనం రింగ్ రోడ్డు మీద తిరుగుతుందని చూసినవారు చెబితే గాని వారికి తెలియదు. వాహనానికి జీపిఎస్ ట్రాకర్ లేదు. చర్లపల్లి పీఎస్ కు చెందిన ఈ వాహనం దుండిగల్ వైపు ఎప్పుడు వెళ్ళింది అటువైపు ఎందుకు వెళ్ళింది అనేది తేలాల్సి ఉంది.
కరీంనగర్‌లో
కరీంనగర్ పోలీస్ స్టేషన్(Karimnagar Police Station)కు చెందిన పెట్రోలింగ్ వాహనాన్ని గుర్తుతెలియని యువకుడు అర్థరాత్రి సమయంలో ఎత్తుకెళ్లాడు. రాత్రి సమయంలో కరీంనగర్‌లో చోరీ వాహనంతో చక్కర్లు కొట్టి నాకా చౌరస్తా వద్ద దుకాణాల నిర్వాహకులను కూడా భయబ్రాంతులకు గురి చేసినట్లు సమాచారం. అనంతరం వరంగల్ వైపు వెళ్లి ఎల్కతుర్తికి సమీపంలో ప్రమాదానికి గురైనట్లు గుర్తించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైంది పోలీసు వాహనం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగి ఉన్నతాధికారులు సైతం అప్రమత్తమయ్యారు.
ఏసీపీ, సీఐలు సైతం రంగంలోకి దిగా వాహనం కోసం గాలింపు చేపడుతూ నానా తంటాలు పడ్డారు. అయితే ఈ ఘటన వెనుక ఓ ప్రచారం కూడా జరుగుతోంది. అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడికి అక్కడ సరైన న్యాయం లభించలేదనే కారణంతో ఇన్నోవాను ఎత్తుకెళ్లాడనే ప్రచారం కూడా జరుగుతోంది. పోలీసు వాహనాన్నే చోరులు ఎత్తుకెళ్లగలిగితే ఇక సామాన్యుల వాహనాల పరిస్థితేంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.