13 April, 2026 | 4:51 AM

మున్సిపాలిటీలో ‘కో-ఆప్షన్’ సందడి

13-04-2026 02:42 AM

పెరగనున్న రాజకీయ వేడి

పదవులు దక్కించుకునేందుకు నేతల చుట్టూ ప్రదక్షిణలు 

ఆమనగల్లు, ఏప్రిల్ 12(విజయక్రాంతి): మున్సిపల్ పాలకమండలిలో కీలక పాత్ర పోషించే కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి నగారా మోగింది. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములయ్యే నలుగురు సభ్యుల ఎంపిక కోసం మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో స్థానిక రాజకీయాల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. మున్సిపల్ కో ఆప్షన్ ఆశావాలనుంచి ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మొత్తం స్థానాలు 04 ఉండగా రిజర్వేషన్లు, పరిపాలనా అనుభవం ఉన్న వారి ని ఇద్దరినీ,మైనార్టీ వర్గాల వారి నుంచి మరో ఇద్దరి కి అవకాశం కల్పిస్తారు.మొత్తం నలుగురిలో ఇద్దరు కచ్చితంగా మహిళలే ఉండాలే అనే నిబంధనకో ఆప్షన్ ఎంపిక ఉంటుంది.ఒకవేళ నాలుగు స్థానాలకు అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే, నిబంధనల ప్రకారం ఎన్నిక నిర్వహించి సభ్యులను ఎన్నుకుంటారు.

ఆశావహుల పరుగు.. తెర వెనుక రాజకీయాలు..

నోటిఫికేషన్ వెలువడటంతో ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద హడావుడి పెరిగింది. గత ఎన్నికల సమీకరణాలను బట్టి చూస్తే ఈ నియామకాలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి.మున్సిపల్ లో మొత్తం 15 వార్డు స్థానాలు ఉండగా  గత నెలలో నిర్వహించిన ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ 8, బీజేపీ 6, కాంగ్రెస్ 1 స్థానాలో గెలుపొందాయి.రాజకీయ పరిణామాల నేపథ్యంలో చైర్మన్ పదవి కాంగ్రెస్ దక్కించుకోగా, వైస్ చైర్మన్ పదవి బీజేపీ కైవసం చేసుకొన్నాయి. ఈ నేపథ్యంలో కో-ఆప్షన్ పదవులు కూడా ఈ రెండు పార్టీల మధ్యే పంచుకోబడే అవకాశం కనిపిస్తోంది.

నేతల చుట్టూ ప్రదక్షిణలు..

కో-ఆప్షన్ పదవిని దక్కించుకోవడమే లక్ష్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తుండగా..బీజేపీ వర్గీయులు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఇందులో కొంత ట్విస్ట్ కూడా దాగి ఉంది. నాలుగు స్థానాలకు నాలుగు కంటే ఎక్కువ  దరఖాస్తులు వస్తే కచ్చితంగా ఓటింగ్  వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో బీజేపీ 2 స్థానాలు, కాంగ్రెస్ కు ఒకటి, బి ఆర్ ఎస్ కి ఒక్క స్థానం దక్కవచ్చు. అయితే కోఆప్షన్ ఎంపిక విషయంలో కౌన్స్ట్రాల్లో అంత ఏకతాటిపై నిలుస్తారా లేదా అనేది అందరి లో సందేహం దాగి ఉంది.

కో ఆప్షన్ సభ్యుడి ప్రాముఖ్యత ఏమిటి?

చాలామందికి కో-ఆప్షన్ సభ్యుల వల్ల ఉపయోగం ఏంటనే సందేహం ఉండవచ్చు. కో ఆప్షన్ ఎన్నికైన వారు నేరుగా ప్రజల ద్వారా ఎన్నిక కాకపోయినా, కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనే హక్కు ఉంటుంది. పట్టణ ప్రణాళిక, బడ్జెట్ రూపకల్పన వంటి విషయాల్లో తమ అనుభవంతో సలహాలు ఇవ్వవచ్చు. వీరికి ఓటు హక్కు ఉండదు కానీ, పట్టణ రాజకీయాల్లో వీరి పట్టు కీలకంగా మారుతుంది. దీంతో చాలా మంది ఆశావాహులు మున్సిపల్ ఎన్నికల్లో సీటు దక్కని వారు ఎలాగైనా కో ఆప్షన్ స్థానాన్ని ప్రవేశం చేసుకునేందుకు తమకున్న పలుకుబడిన గురించి ముమ్మర ప్రయత్నాలు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం బిజెపి నుంచి కండె సీతమ్మ, చుక్క అల్లాజిగౌడ్, కాంగ్రెస్ నుంచి పోస్టపీస్ కాలనీ కి చెందిన ఖాదర్,

బీ ఆర్ ఎస్ నుంచి ఖలీల్ పేర్లు ప్రధానంగావినిపిస్తున్నాయి.

దరఖాస్తుల గడువు ముగిసేసరికి ఎంతమంది రేసులో ఉంటారో, ఎవరికి అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ నియామకం ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆమనగల్లులో హాట్ టాపిక్ గా మారింది.