15 June, 2026 | 5:12 PM

కాంగ్రెస్ అవినీతి వల్లనే సింగరేణి నష్టపోతోంది

15-06-2026 03:49 PM

- కార్మికులకు ఓ రూలు.., అధికారులకు మరో రూలా..?

- మంచిర్యాల ఎమ్మెల్యే  గుండాగిరి బంద్ చెయ్యాలే...

- టీఆర్ఎస్ చీఫ్ కవిత

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ అవినీతి వల్లనే సింగరేణి నష్టపోతుందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. మంచిర్యాల నుంచే బొగ్గుబాయి యాత్ర ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందని, తెలంగాణలో మేము ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ రక్షణ సేనను ప్రారంభించామన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు రైతులు, సింగరేణి కార్మికులు ఇలా ఎన్నో అంశాలపై మాట్లాడుతున్నామని, పోరాడుతున్నామన్నారు.

సింగరేణిలో చాలా మంది కార్మికులను తగ్గించే కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఓపెన్ కాస్ట్ అంటూ కార్మికులను తగ్గించే ప్రయత్నం చేస్తుందని, భూగర్భ గనులు ప్రారంభించడం ద్వారా ఎక్కువ మైనింగ్ చేయవచ్చునని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చన్నారు. డిప్యూటీ సీఎం భట్టి అంతా తన కనుసన్నల్లోనే జరగాలనే ప్రయత్నం చేస్తున్నారని, కార్మికుల హక్కులను హరిస్తూ వారిపై శాడిజం చూపిస్తున్నారని, కార్మికులతో వెట్టి చాకిరి చేయించటం సరికాదని, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.

కార్మికులకు ఓ రూలు.. అధికారులకు మరో రూలా..!

సింగరేణిలో ఇంకా కార్మికులను వేదింపులకు గురి చేస్తున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. విధులకు కొంచెం ఆలస్యమైనా అటెండెన్స్ వేయమంటూ వేదిస్తున్నారని, కార్మికులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో కూడా కార్మికులకు ఒకలా, ఆఫీసర్లకు మరోలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణిలో ప్రతి శనివారం ఉద్యోగాల జాతర జరగాలి కానీ ఇక్కడ ఎంత మంది సస్పెండ్ చేద్దామా అని లెక్కలు వేస్తున్నారని, ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని, సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలు అన్ని ఇచ్చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని దుయ్యబట్టారు. సింగరేణి కార్మికులకు సరైన వసతులు కల్పిస్తే బంగారం పండిస్తారని, ప్రతి గనిలో ఈ పరిస్థితిని మేము గమినించామని, కార్మికులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు.

లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మనాలు చేయాలి

కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వాటికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. గతంలో సింగరేణిలో వచ్చే పోస్టులను జీఎం ఇచ్చే వారని, ఇప్పుడు వాటిని సీఎం ఇస్తున్నాడని, జీఎం చేసే పనులను సీఎం, క్లర్క్ చేసే పనులకు డిప్యూటీ సీఎం చేస్తున్నారని హెద్దేవా చేశారు. కార్మికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ సంస్థను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. న్యాయం చేయగలిగే పరిస్థితుల్లో ఉండి ప్రతిపక్షాల మాదిరిగా కార్మికుల దగ్గరకు వస్తున్నారని విమర్శించారు. సింగరేణి హక్కులను కాపాడేది హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. ఈ గడ్డ మీది నుంచే తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేస్తుందని, ఈ ప్రాంత ప్రజల ప్రేమను పొంది అన్ని చోట్ల టీఆర్ఎస్ జెండా ఎగురేస్తామన్నారు.

తెలంగాణ మినరల్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి...

గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ మినరల్స్ కార్పొరేషన్ ఉన్నట్లు తెలంగాణలో సైతం తెలంగాణ మినరల్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మైనింగ్, మినరల్స్ అన్ని నడిపించాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గుజరాత్ లో మాదిరిగా తెలంగాణలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణిలో మైన్ డెవలప్ మెంట్ విధానం తెస్తే అండర్ గ్రౌండ్ మైనింగ్ కూడా చేసుకోవచ్చునని అన్నారు. సింగరేణి విషయంలో నిజాం రాజు చాలా గొప్ప పని చేశారని, తెలంగాణలో గోదావరి పరివాహాకంలో ఉన్న బొగ్గు అంతా కూడా సింగరేణికే రాసిచ్చారని, కానీ కాంగ్రెస్ చేసిన స్కాం కారణంగా మనకు నష్టం వచ్చిందన్నారు.

ఆ బొగ్గు కుంభకోణాన్ని సాకుగా చూపి బీజేపీ అధికారంలోకి వచ్చాక 250 బ్లాక్స్ ను జాతీయం చేసిందన్నారు. సత్తుపల్లిలో కోల్ మైన్స్ పోతే సింగరేణి కూడా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ భూమి పుత్రుడే అయితే మన తెలంగాణకు ఎక్కువ బ్లాక్ లు వచ్చేలా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐటీ తీసేయాలని కోరితే బీజేపీ అధికారంలోకి వచ్చాక తీసేస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నారని, అసలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం కల్ల అని హెద్దేవా చేశారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు ఎక్కువ కోల్ బ్లాక్స్ అలకేట్ చేయించాలని, కార్మికులకు ఐటీ లేకుండా చేయాలన…