రాజ్యాధికారమే బీసీల దశ దిశ!
పాపని నాగరాజు :
రాజకీయాల్లో క్రమశిక్షణ అవసరమే. అయితే అది వ్యక్తి, పదవి, లింగం, సామాజిక నేపథ్యాన్ని బట్టి మారే ప్రమాణంగా కాకుండా అందరికీ సమానం గా వర్తించాలి. కానీ, కొండా సురేఖ(Konda Surekha) మంత్రి పదవి బర్తరఫ్ సందర్భంగా గతంలో పలువురు కాంగ్రెస్ నాయకులు(Congress leaders) తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలను పరిశీలిస్తే క్రమశిక్షణకు ఒకే కొలమానం ఉందా? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. మహిళలు రాజకీయాల్లోకి(Women in politics) వచ్చినా, స్వతంత్రంగా మాట్లాడే, ప్రశ్నించే స్థలం వారికి ఎంతవరకు లభిస్తోందనేది కూడా ఈ సందర్భంగా ఆలోచించా లి. మహిళా నాయకత్వాన్ని(Womens leadership) ప్రోత్సహించడం అంటే పదవి ఇవ్వడం మాత్రమే కాదు; ఆమె స్వతంత్ర రాజకీయ వ్యక్తిత్వాన్ని గౌరవించడం కూడా.
అయితే కొండా సురేఖ ఘటనను ఒక మంత్రి పదవి కోల్పోయిన సంఘటనగా మాత్రమే చూడటం ఈ చర్చను పరిమితం చేస్తుంది. ఇది బీసీ రాజకీయాల్లో నాయకత్వం అంటే ఏమిటి, బీసీవాదానికి అసలు ప్రమాణం ఏమిటి అనే ప్రశ్నను ముందుకుతెస్తోంది. ఒక వ్యక్తి బీసీ వర్గానికి చెందినవాడై పదవిలో ఉండటం ఒక సామాజిక గుర్తింపు మాత్రమే. కానీ బీసీ భావజాలంతో పనిచేయడం ఒక రాజకీయ నిబద్ధత. ఆ నిబద్ధత పదవిలో ఉన్నప్పుడు కూడా ఉండాలి, పదవి పోయిన తర్వాత కూడా కొనసాగాలి.
పదవి కోల్పోయినప్పుడు మాత్రమే బీసీ అన్యాయం గుర్తుకురావడం సరిపోదు. బీసీ వాదం వ్యక్తిగత రాజకీయ నష్టాన్ని సమర్థించుకునే భాష కాదు. అందరికీ సమాన హక్కు లు, అవకాశాలు అందాలనే నిరంతర నిబద్ధతే దాని అసలు పరీక్ష. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినంత తీవ్రతతో, తనకు సంబంధం లేని బీసీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కూడా ప్రశ్నించినప్పుడే ఆ వాదనకు విశ్వసనీయత లభిస్తుంది.
యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా ఈశ్వరమ్మ యాదవ్‌ను నియమించిన సందర్భం లో ఒక వ్యక్తి చేసిన దుర్భాషల వివాదం కూడా ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఒక బీసీ మహిళకు బాధ్యతాయుతమైన పద వి లభించినప్పుడు ఆమెను గౌరవించాల్సింది పోయి అవమానకరమైన భాష ఉపయోగి స్తే, దాన్ని కేవలం వ్యక్తిగత వివాదంగా చూడ లేం. బీసీ మహిళ గౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతిన్నప్పుడు ఆమెకు అండగా నిలిచిన స్వరాలు ఎక్కడ? పదవి కోల్పోయినప్పుడు బీసీ ఆత్మగౌరవం గుర్తుకురావడం ఒకటైతే, పదవిలో ఉన్న బీసీ మహిళ అవమానానికి గురైనప్పుడు అదే ఆత్మగౌరవంతో నిలబడటం మరోటి. రెండింటినీ ఒకే ప్రమాణంతో చూడాలి.
బీసీ నాయకత్వం తనను తాను ప్రశ్నించుకోవాల్సిన మరో అంశం ఇది. అధికారం లో ఉన్నవారికి అసౌకర్యం కలగని వరకు మాత్రమే మాట్లాడటం నిజమైన స్వతంత్రతేనా? పాలక వ్యవస్థను ప్రశ్నించాల్సిన సందర్భంలో మౌనం పాటిస్తూ, వ్యక్తిగత రాజకీ య ప్రయోజనం దెబ్బతిన్నప్పుడు మాత్రమే గళం విప్పడం ఏ రకమైన రాజకీయ నిబద్ధ త? ఈ ప్రశ్నలను అడగడం వ్యక్తులపై ఆరోపణ చేయడం కాదు. నాయకత్వానికి ప్రజలు పెట్టే ప్రజాస్వామిక పరీక్ష.
చట్టసభల్లో సామాజిక వర్గాల మధ్య పరస్పర సంఘీభావం కూడా పెరగాలి. బీసీ ప్రతినిధి ఎస్సీల సమస్యను లేవనెత్తినప్పుడు ఎస్సీ ప్రతినిధులు అతని వెంట నిలబడాలి. ఎస్టీ సమస్య వచ్చినప్పుడు బీసీ, ఎస్సీ ప్రతినిధులు స్పందించాలి. ఒకరి హక్కును మరొకరు తమ హక్కుగా భావించే రాజకీయ సం స్కృతి అవసరం. ఈ సందర్భంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసనమండలిలో లేవనెత్తుతున్న ప్రశ్నను ప్రత్యేకంగా చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జనాభా, ప్రాతినిధ్యం తగ్గుతున్న పరిస్థితిలో ఒకే సామాజిక వర్గం ప్రాతినిధ్యం ఎలా పెరుగుతోందనే ప్రశ్నను ఆయన లేవనెత్తుతున్నారు. ఇది కేవలం బీసీ ల ప్రశ్న కాదు; తమ జనాభాకు తగిన వాటా, ప్రాతినిధ్యం, నిర్ణయాధికారం కోల్పోతున్న అన్ని సామాజిక వర్గాల ప్రశ్న. అందుకే ఆయన లేవనెత్తే ప్రశ్న ఆయన వ్యక్తిగత స్వరంగా శాసనమండలిలోనే ఆగిపోకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులందరి స్వరంగా మారాలి. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా తమ తమ పార్టీల గీతలను దాటి ఈ ప్రశ్నపై స్పందించాలి. ఒక వర్గం ప్రతినిధి మరో వర్గం హక్కు కోసం నిలబడ టం, అదే విధంగా మిగతా వర్గాల ప్రతినిధులు కూడా పరస్పరం అండగా నిలబడ టం ప్రజాస్వామిక రాజకీయ సంస్కృతికి అవసరం.
బీసీ మహిళా నాయకత్వం విషయంలో ఈ చర్చ మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. రాజకీయాల్లో మహిళలకు ఇప్పటికే అనేక పరిమితులు ఉన్నాయి. అందులో కులం, ఆర్థిక పరిస్థితి, సామాజిక స్థానం వంటి అంశాలు కలిసినప్పుడు బీసీ మహిళ ఎదుర్కొనే అడ్డంకులు మరింత సంక్లిష్టమవుతాయి. అందుకే ఆమెకు పదవి ఇవ్వడమే కాదు, స్వతంత్రంగా మాట్లాడే అవకాశం, నిర్ణయం తీసుకునే అధికారం, తన రాజకీ య అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఉండాలి. మహిళా నాయకత్వాన్ని అలంకారంగా ఉపయోగించుకుని, స్వతంత్ర స్వరం వచ్చినప్పుడు క్రమశిక్షణ పేరుతో అణచివేయడం ప్రజాస్వామిక సాధికారత కాదు.
కాబట్టి బీసీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక కొత్త ప్రశ్నను ఎదుర్కొంటోంది. మనకు కేవలం బీసీ పేరుతో పదవులు పొందే నాయకత్వం కావాలా? లేక పదవి ఉన్నా లేకపోయినా హక్కుల కోసం నిలబడే నాయకత్వం కావాలా? అధికారానికి దగ్గరగా ఉండటం రాజకీయ విజయమా? లేక అవసరమైనప్పుడు అధికారాన్ని ప్రశ్నించగల స్వతంత్రత రాజకీయ విలువా? నాయకుడి వెంట ఎంతమంది ఉన్నారన్నదే నాయకత్వానికి ప్రమాణమా? లేక తన తర్వాత స్వతంత్రంగా ఆలోచించే, ప్రశ్నించే నాయకులను ఎంతమంది ని తయారు చేశారన్నదే ప్రమాణమా?
బీసీ భవిష్యత్తు కేవలం బీసీలకే పరిమితమైన ప్రశ్న కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు దేశంలోని వనరులు, అవకాశాలు, అధికారంలో న్యాయమైన భాగస్వామ్యానికి సమగ్ర సామాజిక హక్కుదారులు.ఒక వర్గం హక్కును మరో వర్గం తన హక్కుగా భావించే రాజకీయ సం స్కృతి ఏర్పడినప్పుడే ఈ హక్కుల పోరాటానికి విస్తృత ప్రజాస్వామిక బలం వస్తుంది.
కొండా సురేఖ ఘటన ఒక మంత్రి పదవి దగ్గర ముగియకూడదు. అది మహిళా రాజకీయ స్వేచ్ఛ, బీసీ నాయకత్వ నిబద్ధత, బీసీ మహిళల గౌరవం, చట్టసభల్లో పరస్పర సం ఘీభావం, ప్రభుత్వ వ్యవస్థలో సామాజిక బాధ్యత వంటి ప్రశ్నలను ముందుకుతెచ్చే సందర్భంగా మారాలి. బీసీ రాజకీయాలకు ఇప్పుడు అవసరమైనది వ్యక్తులను కాపాడే వాదం కాదు; నాయకత్వాన్ని పరీక్షించే కొత్త ప్రమాణం. పదవిలో ఉన్నప్పుడు ఒక మాట, పదవి పోయినప్పుడు మరో మాట కాకుండా, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడే రాజకీయ నిబద్ధత కావాలి. అదే బీసీ రాజకీ య భవిష్యత్తును వ్యక్తి ఆధారిత రాజకీయాలను దాటి రాజ్యాధికార సాధన వైపుకు నడిపించే మార్గం.
వ్యాసకర్త: సత్యశోధక మహాసభ ప్రతినిధి