5 September, 2026 | 7:16 AM

ప్రభుపాదుల జీవితం అనుసరణీయం

05-09-2026 | 05:25am

నేడు స్వామి ప్రభుపాదుల అపియరెన్స్ డే :

దైవ సమానులు, మానవుల్లో మాధవ సమానుడు అభయ్ చరణ్ డె(Abhay Charan De) భక్తివేదాంత స్వామి ప్రభుపాద కృష్ణాష్టమి(Krishnashtami) తదుపరి రోజున ‘నందోత్సవం’ శుభ గడియల్లో 1896 సెప్టెంబర్ 1న కలకత్తాలో(Kolkata) జన్మించారు. గౌడీయా వైష్ణవ కుటుంబంలో జన్మించిన అభయ్ చరణ్ డె చిన్నతనం నుంచే భక్తిశ్రద్ధలతో భగవాన్ కృష్ణుడి భక్తి సాగరంలో మునిగిపోయారు. ఆయన తం డ్రి గౌర్ మోహన్ డె, తల్లి రంజని.

బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు జాతకం చూపించగా, అభయ్ చరణ్ ఎదిగిన తర్వాత మహాసముద్రాలు దాటి హైందవాన్ని ప్రచారం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా 108 కృష్ణ మందిరాలు (ఇస్కాన్ టెంపుల్స్)(ISKCON Temples) నెలకొల్పుతాడని చెప్పారట. ఇంతటి మహానుభావుడి జన్మదినాన్ని కృష్ణాష్టమి(Krishnashtami) తదుపరి 2026 సెప్టెంబర్ 5న శ్రీల ప్రభుపాదులు కనిపించిన లేదా జన్మించిన దినం (శ్రీల ప్రభుపాద అపియరెన్స్ డే)గా పాటిస్తారు. ఇదే రోజున వ్యాస పూజ దినంగా కూడా జరుపుకోవడం ఆనవాయితీ.

1922లో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్(Saraswati Thakur) అనే గురువు వద్ద చేరి 1933లో పూర్తి శిష్యులుగా మారారు. నాటి నుంచే భక్తి వేదాంతం, భగవద్గీత సంబంధ రచనలు చేస్తూ, పలు ప్రఖ్యాత భక్తి ఇతివృత్త పుస్తకాలను రచించారు. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్య సూత్రంగా కార్యక్రమాలు నిర్వహించాలని తన గురువు ఆదేశించగా, తన 69వ ఏట 1965లో అమెరికా చేరారు. 1966లో ఇస్కాన్ సంస్థను స్థాపించి, కృష్ణ చైతన్యంతో పాటు సరళ రీతిలో భగవద్గీతను బోధిస్తూ, అనతి కాలంలోనే పాశ్చాత్య భక్తులను ఏకం చేయగలిగారు.

నేడు ఇస్కాన్ గొడుగు కింద 108 దివ్య కృష్ణ మందిరాలు నిర్వహించడంతో పాటు పాఠశాలలు, పౌర సమాజ చైతన్య కేంద్రాలు నిర్వహించే స్థాయికి తీసుకువచ్చారు. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు 1977 నవంబర్ 14న తుది శ్వాస విడిచారు. ప్రభుపాదుల స్వామి జన్మదినం రోజున ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇస్కాన్ మందిరాల్లో కృష్ణ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పలు కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటిగా మారింది.

ఆధ్యాత్మిక ప్రవచనకర్త, కృష్ణ తత్వ బోధకులు భక్తివేదాంత స్వా మి ప్రభుపాద జీవితం ఆసాంతం అద్భుతాలమయం, అనుసరణీ యం. నిరాడంబరత, పరిశుభ్రత, సత్యసంధత, కరుణ అనే నాలుగు సద్గుణాలు సన్మార్గాన్ని చూపుతాయని ఉపదేశించారు. కృష్ణ బోధనలు, శ్రీకృష్ణుడి జీవితమే మానవాళికి దారిచూపుతుందని ప్రబోధించారు.

శ్రీల ప్ర భుపాద జన్మించిన రోజున ప్రపంచవ్యాప్త కృష్ణ భక్తులు హరే కృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే; హరే రామ హరే రామ రామ రామ హరే హరే అంటూ భజనలు, కీర్తనలు జపిస్తూ భక్తిని చాటుకుంటారు. పరమ కృష్ణుడి భక్తులైన ప్రభుపాదుల వారు కృష్ణుడు జన్మించిన తర్వాత రోజున నందోత్సవ సమయంలో జన్మించడం ఓ అద్భుతమైన పరమాత్ముడి లీల అనే చెప్పాలి. 

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి  

వ్యాసకర్త సెల్: 9949700037

మరిన్ని వార్తలు