22-ఏ బాధిత రైతులకు అండగా ప్రశాంత్‌రెడ్డి
మాజీ మంత్రి హరీష్‌రావును కలిసి వినతిపత్రం అందజేత
ఫోటో రైట్ అప్ వినతిపత్రం అందజేస్తున్న రైతులు
ఆదిభట్ల, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని పలు గ్రామాల రైతులు సెక్షన్ 22-ఏ ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాందాస్‌పల్లి, కోహెడ, పటేల్‌గూడ, శేరిగూడ తదితర గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రైతులు తమ భూములను విక్రయించలేక ఇబ్బందులు పడుతున్నారు.
22-ఏ కారణంగా రైతుబంధు, రైతుబీమా వంటి ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో పాటు బ్యాంకు రుణాలు పొందడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి (బంటి) దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో బాధిత రైతులతో కలిసి ప్రశాంత్‌రెడ్డి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అర్హత ఉన్న రైతులు, ప్రైవేట్ భూములను 22-ఏ పరిధి నుంచి తొలగించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
సమస్యపై స్పందించిన హరీష్‌రావు ప్రభుత్వం వెంటనే 22-ఏ ఆంక్షలను తొలగించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే రెండు రోజుల్లో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రైతుల తరఫున ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు






