02-02-2026 05:58:28 PM
తెలంగాణ వ్యాప్తంగా ఆహ్వాన వాల్ పోస్టర్ల ప్రచారం
ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ
వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం,అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రాబోయే మహాశివరాత్రి జాతర నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతరకు భక్తులను ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాల్ పోస్టర్లను అతికించే కార్యక్రమాన్ని దేవస్థాన అధికారులు చేపట్టారు. ఫిబ్రవరి 14, 15, 16 తేదీలలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతరకు సంబంధించి తొలి ఆహ్వాన వాల్ పోస్టర్‌ను ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు వస్తారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ముందస్తు ప్రచారాన్ని ప్రారంభించాం. జాతర తేదీలు, కార్యక్రమాల వివరాలు భక్తులకు సులభంగా చేరేలా రాష్ట్రవ్యాప్తంగా వాల్ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం” అని తెలిపారు.రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, జాతర వివరాలు భక్తులకు ముందుగానే తెలియజేయాలనే ఉద్దేశంతో వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.