నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
నల్గొండ: నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేసి జిల్లా నుంచే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. అనంతరం రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ. 13.06 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,092 కి.మీ. పొడవు గల 441 రహదారులను విస్తరించే కార్యక్రమం పైలాన్ ఆవిష్కరణతో ప్రారంభమైంది. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్థానికులను పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు. జిల్లాలో సూమారు రూ.1100 కోట్ల నిధులతో రోడ్ల అభివృద్ధి, నల్గొండ వైద్య కళాశాల నుంచి మేళ్లదుప్పలపల్లి వరకు రోడ్ల విస్తరణ, దర్వేశిపురం నుంచి డిండి వరకు, చిట్యాల నుంచి భువనగిరి వరకు హ్యామ్ విధానంలో రోడ్ల విస్తరణ జరుగుతుందని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






