పండుగ వేళ.. ధరలకు రెక్కలు
ధరలకు కళ్లెం వేయడంలో ప్రభుత్వాలు విఫలం
ఘట్ కేసర్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): బంగారం ధరలతో పోటీపడి నిత్యావసర వస్తువుల ధరలన్నీ భగ్గుమంటుంటే సామాన్య ప్రజలకు దిక్కుతోచడం లేదు. సామాన్యుడికి బాసటగా నిలుస్తామంటూ ప్రకటించిన పాలకులు చోద్యంచూస్తున్నారు. మూకుమ్మడి ధరాఘాతాల నుంచి రక్షణ కొరవడి సగటు పౌరుడు విలవిల్లాడుతున్నా పట్టించుకోవడం మరిచారు.
జనం జేబులకు అనునిత్యం తూట్లుపడుతున్న వైనంపై తీవ్రవిమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న ధరలకు కళ్లెం వేయడంలో ప్రభు త్వాలు చేపట్టిన చర్యలు శూన్యమనే చెప్పాలి. పండగల సీజన్(Festive Season) ప్రారంభం కావడంతో మార్కెట్లో పండ్ల ధరలకు రెక్కలు వచ్చి నింగినంటుతున్నాయి.
దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు పండ్లు కొని తినలేకపోతున్నారు. సోమవారం నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈనేపథ్యంలో వివిధ రకాల పండ్లు వాటి ధర లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ విధంగా పెరిగిన ధరలతో పండ్లుకొని తెచ్చుకోలేక పోతున్నామని పలువురు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రథమ గణాంకాల్లో మొదటి వాడైన వినాయకునికి పూజలు చేసేందుకు ముఖ్యమైన పండ్లు తాము కొనే స్థాయిలో లేమంటున్నారు.
గణపతికి కరువు తాకిడి
వినాయక చతుర్దశి(Vinayaka Chaturthi) సందర్బంగా మొదటి రోజున వినాయకుడికి ప్రతిమలు ప్రతిష్ఠించి పూ జలకు ఉపయోగించే వస్తువుల ధరలు కూ డా పెరగడంతో నిర్వాహకులు కొనలేకపోతున్నారు. దీంతో ప్రతియేటా పండ్లు, ఫలాలు పత్రాలతో ఘనంగా పూజలందుకునే గణనాధుడికి ఈయేడు ఇవన్నీ కొరవడే పరిస్థితులు నెలకొన్నాయి. పూజలు ఉపయోగించే వాటిలో బంతిపూలు కిలో రూ. 100, చా మంతి పూలు కిలో రూ. 400 కాగా ప్రధానమైన ప్రతిఆకులు రూ. 100 ఒక కట్ట, మా రేడుకాయ రూ. 30 ఒకటి, అడవిమునగ రూ. 25 ఒకటి, తామరాకు రూ. 51, అడవి జిల్లేడు రూ. 20 ఒకటి, సీతాఫలం రూ . 30, ధరలు చుక్కలను చూపిస్తున్నాయి.
వినాయక చవితి సందర్బంగా వాడవాడలా, ఇళ్లల్లోను, ప్రధాన కూడ ళ్లలో, బస్తీలల్లో వినాయక విగ్రహాలను పోటీపడి ప్రతిష్టించే సాంప్రదాయాన్ని మనం చూశాం. సోమవారం వినాయక చవితి పండగ ఉన్నప్పటికీ అక్కడక్కడ తప్ప వినాయక విగ్రహాల విక్రయాలు ఎక్కువగా కనిపించడం లేదు. గతంలో వినాయక విగ్రహాలు ఒక సంతలాగ సాగేది. నేడు అక్కడక్కడ మాత్రమే విక్రయాలు కనిపిస్తున్నాయి. కొనుగోలు దారులు కూడా ఎక్కువ కనిపించడంలేదు. ఈ సారి వినాయక విగ్రహాల విక్రయ కేంద్రాల వద్ద మట్టి వినాయకులను కూడా ఉంచారు.