27 February, 2026 | 3:07 AM

ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు

27-02-2026 01:04 AM

100 మిలియన్ ఇన్‌స్టా ఫాలోవర్లు కలిగిన తొలి రాజకీయ నేతగా గుర్తింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 : భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రపంచంలో 100 మిలియన్ ఇన్‌స్టా ఫాలోవర్లు కలిగిన తొలి రాజకీయ నేతగా సరికొత్త రికార్డును నెలకొల్పారు. 2014లో ప్రధాని మోదీ తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. యువతరానికి కనెక్ట్ కావడంతో ఆయన ఫాలోవర్ల సంఖ్య నాటి నుంచీ పెరుగుతూనే ఉంది. ఫాలోవర్ల సంఖ్యాపరంగా ప్రధాని మోదీ తరువాతి స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ నిలిచారు.

ఆయనను ఇన్‌స్టాలో ఫాలో అయ్యే వారి సంఖ్య 43.2 మిలియన్లు. ఆ తరువాతి స్థానాల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో (15 మిలియన్ ఫాలోవర్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా (14.4 మిలియన్ ఫాలోవర్లు), తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్ (11.6 మిలియన్ ఫాలోవర్లు), అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ (6.4 మిలియన్ ఫాలోవర్లు) ఉన్నారు. ట్రంప్‌తో పాటు ఆ తరువాత నాలుగు స్థానాల్లో ఉన్న నేతల ఫాలోవర్లు సంఖ్యను కలిపి చూసినా ప్రధాని మోదీ కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.

ఇక భారతీయ నేతల్లోనూ ఫాలోవర్ల సంఖ్యాపరంగా ప్రధాని నెం.1గానే ఉన్నారు. ప్రధాని తరువాతి స్థానంలో ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 16.1 మిలియన్ ఇన్‌స్టా ఫాలోవర్లు ఉండగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉన్న ఫాలోవర్ల సంఖ్య 12.6 మిలియన్లు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రధాని ఇన్‌స్టా వేదికగా వివిధ అధికారిక కార్యక్రమాలు, అంతర్జాతీయ పర్యటనలు, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు వివరాలను పంచుకుంటూ ఉంటారు. తన మనసులోని భావాల నూ ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంటారు.