calender_icon.png 18 February, 2026 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు ప్రాధాన్యం

18-02-2026 01:12:36 AM

గ్రామ సర్పంచ్ మర్రి సంధ్య

అశ్వాపురం, ఫిబ్రవరి 17, (విజయక్రాంతి): మొండికుంట గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం గ్రామ సర్పంచ్ మర్రి సంధ్య అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, నిధుల వినియోగంపై సవివరంగా చర్చించారు. పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గ్రామపంచాయతీకి అందిన నిధులు, వాటితో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను సభకు తెలియజేశారు.

గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల గ్రామస్థాయి అధికారులు తమ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలను వివరించారు. గ్రామసభలో పాల్గొన్న గ్రామస్తులు గ్రామంలోని డ్రైనేజ్ సమస్యలు, వీధి దీపాల ఏర్పాటు, కొత్తగా నిర్మించిన ఇళ్లను గ్రామపంచాయతీలో నమోదు చేయడం, బీజీ కొత్తూరు రహదారి వెంబడి ఉన్న ఇళ్లలోకి దుమ్ము దూళి రాకుండా నీరు చల్లే చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి సంధ్య మాట్లాడుతూ, గ్రామస్తులు తెలియజేసిన ప్రతి సమస్యను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు అందిన వెంటనే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీకి సహకరిస్తున్న అన్ని శాఖల అధికారులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ ఏపీవో సీతారామయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ చల్లమల్ల శివకుమార్, వార్డు సభ్యులు తోట చైతన్య, రామిడి శంబారెడ్డి, మూతి రమణి, రామగిరి చంద్రకళ, కొల్లు మంగమ్మ, ఆకిటి సిద్ధార్థ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.