21 June, 2026 | 2:42 AM

మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం

21-06-2026 01:27 AM

మంత్రి ధనసరి సీతక్క

ఆలేరు, జూన్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో కొత్తగా నిర్మించిన దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రం, జెండర్ రీసోర్స్ సెంటర్, మహిళ సహకార అభివృద్ధి సంస్థ భవనాన్ని శనివా రం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్రాజెక్టులు, ఐకేపీ సెంటర్లు, మొబైల్ క్యాంటీన్లతో పాటు రైతు డ్రోన్ల నిర్వహణను కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తున్నామన్నారు. మహిళల అభ్యున్నతి కోసం రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఆలేరు అభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయలు మంజూరు చేశామని, మహిళలు, చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వారికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.  కార్యక్రమంలో విప్‌లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.