21 June, 2026 | 2:08 AM

లైక్ కొడితే లైఫ్ ఖాళీ!

21-06-2026 12:54 AM
  1. రాష్ట్రంలో టాస్క్ రాకెట్ మాయాజాలం
  2. దేశంలోనే సైబర్ నేరాల్లో మనమే టాప్
  3. పల్లెల్లోనూ పంజా విసురుతున్న సైబర్ నేరగాళ్లు
  4. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెచ్చిపోతున్న కేటుగాళ్లు
  5. ఐపీఎస్ పేరుతో ఒకరు.. రివ్యూల పేరిట మరొకరు.. లక్షల్లో నిలువునా దోపిడీ

సంగారెడ్డి, జూన్ 20 (విజయక్రాంతి): కూర్చున్న చోటు నుంచే వేలల్లో సంపాదన.. యూట్యూబ్ వీడియోలకు లైక్ కొడితే చాలు ఖాతాలోకి వందల రూపాయలు.. గూగుల్ రివ్యూస్ రాస్తే కమీషన్లు.. వినడానికి ఎంతో ఆశగా ఉండే ఈ ఆఫర్ల వెనుక ఒక నిశ్శబ్ద నేర సామ్రాజ్యం దాగి ఉంది. పార్ట్-టైమ్ ఉద్యోగాల పేరుతో సామాన్యులను ఊబిలోకి లాగుతున్న సైబర్ నేరగాళ్లు వారిని నిలువునా ముంచుతున్నారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆ ర్బీ) తాజా నివేదిక ప్రకారం, దేశంలోనే అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రా ల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 71.1 రేటుతో సైబర్ మోసాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ కేటుగాళ్లు బాధితులను బుట్టలో వేయడానికి ప్రధానంగా వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లను వాడుకుంటున్నారు.  

యూట్యూబ్ లింకులతో మోసం

మొదట బాధితులకు మెసేజ్ చేసి కొన్ని యూట్యూబ్ లింకులు పంపిస్తారు. వాటిని లైక్ చేసి స్క్రీన్ షాట్ పెడితే రూ.50 నుంచి రూ.150 వరకు నిజంగానే ఖాతాలో వేసి నమ్మకం కలిగిస్తారు. నమ్మకం కుదిరాక, టెలిగ్రాంలోని ఒక వీఐపి గ్రూపులోకి మారుస్తారు. అక్కడ ‘ప్రీపెయిడ్ టాస్క్‘ లేదా క్రిప్టో ట్రేడింగ్ పేరుతో చిన్న మొత్తంలో (రూ.వెయ్యి లేదా రూ.3 వేలు) ఇన్వెస్ట్ చేయిస్తారు. దానికి వెంట నే 30 శాతం అదనపు లాభంతో కలిపి వెనక్కి ఇచ్చేస్తారు.

బాధితుడు పూర్తిగా లొంగిపోయా క, లక్షల్లో పెట్టుబడి పెట్టమని ఒత్తిడి తెస్తారు. బాధితుడికి ఒక నకిలీ వెబ్‌సైట్ డాష్‌బోర్డ్ ఇచ్చి, అందులో అతని లక్షల రూపాయలు కోట్లలో లాభాలుగా మారినట్లు చూపిస్తారు. తీరా ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోబోతే.. అకౌం ట్ వెరిఫికేషన్ ఫీజు, జీఎస్టీ, టీడీఎస్ అంటూ మరికొన్ని లక్షలు డిపాజిట్ చేయిస్తారు. చివరికి బాధితుడి వద్ద డబ్బు అయిపోయాక గ్రూపుల నుంచి బ్లాక్ చేసి మాయమవుతారు. 

తెలంగాణలో నమోదైన కేసుల..

ఇటీవల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూ రో (టీజీసీఎస్బీ) వెల్లడించిన వివరాల ప్రకా రం.. హైదరాబాద్ పరిధిలోని 127 మంది వైద్యులు కేవలం బిజినెస్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కా మ్‌ల ద్వారా రూ.22.39 కోట్లు పోగొట్టుకున్నా రు. బేగంపేటకు చెందిన ఒక వ్యక్తి టెలిగ్రాంలో హో టల్ రివ్యూస్ టాస్క్ స్కామ్ లో చిక్కుకుని, కమీషన్ల ఆశతో ఏకంగా రూ.3.5 లక్షలకు పైగా పోగొట్టుకున్నా డు. సైబరాబాద్ పరిధిలో ఇటీవల దేశవ్యాప్తంగా సాగిన ఆపరేషన్లో పోలీసులు 25 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు.

వీరంతా ఫేక్ యాప్స్, పార్ట్ టైమ్ జాబ్స్ ద్వారా దాదాపు రూ.3.47 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసు లు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లతో లింకులు ఉన్న ఒక భారీ సైబర్ ఫ్రాడ్ నెట్వర్‌కను ఛేదించారు. వీరు పాత మొబైల్ ఫోన్ల మదర్‌బోర్డుల నుం చి నుండి డేటా, ఐఎంఈఐ నంబర్లను సేకరించి, బ్యాంకు అధికారుల్లా నటిస్తూ ప్రజల ఓటీపీలను దొంగిలించి అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు.

తెలంగాణలో 27,230 సైబర్ కేసులు నమోదు కాగా గత ఏడాది కంటే 49 శాతం పెరిగాయి. ఫ్రాడ్, చీటింగ్ కింద 21,987 కేసులు నమోదయ్యా యి. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల 103 మం ది పాత సైబర్ నేరగాళ్ల కదలికలపై నిఘా పెట్టి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. 

ఉమ్మడి మెదక్ జిల్లాలో..

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లంపల్లిలో ఇన్‌స్టాగ్రామ్ ఫేక్ ఐడీల ద్వారా ఒకే వ్యక్తి ఇద్దరు యువతులను నమ్మించి ఏకంగా రూ.12 లక్షల నగదు, తులం బంగా రం దోచేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకరికి తాను ఐపీఎస్ ట్రైనీ అని, మరొకరికి ఎంబీబీఎస్ స్టూడెంట్ అని అబద్ధాలు చెప్పి పెళ్లి పేరుతో దగాకు పాల్పడ్డాడు. నర్సాపూర్‌కు చెందిన ఒక కిరాణా దుకాణం యజమానికి రీఫండ్ ఇప్పిస్తామని నమ్మించి, అతని ఫోన్ తీసుకుని రూ.1.28 లక్షలు మాయం చేశారు.

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో  స్కూళ్లు, కాలేజీ ల్లో సీట్లు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రులకు ఫోన్లు, వాట్సాప్ మెసేజ్లు పంపిస్తూ అడ్వాన్స్ ఫీజుల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న రాకెట్‌పై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఒక రిటైర్డ్ ఉద్యోగిని డిజిటల్ అరె స్ట్ పేరిట భయపెట్టి, మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారంటూ బెదిరించి  రూ.58.94 లక్షలు దోచుకున్నారు.

కల్హేర్ మండలానికి చెందిన ఒక సర్పంచుకు రూ.80 లక్షల నగదు, ముంబైలో ఫ్లాట్, ల్యాండ్ క్రూజర్ కారు లాటరీ తగిలిందంటూ నమ్మించారు. దానికి జీఎస్టీ, కస్టమ్స్ క్లియరెన్స్ పేరిట నకిలీ సీబీఐ పత్రాలు చూపిస్తూ రూ.4.12 లక్షలు వసూలు చేశారు. సదాశివపేటలో ఒక వార్డు కౌన్సిలర్ భర్త మొబైల్‌కు వచ్చిన ఒక అపరిచిత మెసేజ్ లింక్‌ను క్లిక్ చేయడంతో, మూడు ట్రాన్సాక్షన్లలో ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ.7.79 లక్షలు కట్ అయ్యాయి.

సిద్దిపేట జిల్లా పరిధిలో ఒక ఎంపీడీవో రూ.5 లక్షలు పోగొట్టు కున్నారు. సిద్దిపేట, దుబ్బాక, వర్గల్ ప్రాంతాల్లోని మీసేవ సెంటర్ల యజమానులకు ఉన్నతాధికారుల పేరిట ఫోన్లు చేసి బెదిరింపులకు గురిచేస్తూ వేల రూపాయలు వసూలు చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

నమ్మితే మోసమే: పోలీసులు

సోషల్ మీడియాలో వచ్చే  ప్రకటనలను అస్సలు నమ్మవద్దని పోలీసులు చెపుతున్నారు. ఉద్యోగం ఇవ్వడానికి ఎవరైనా ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ లేదా ట్రైనింగ్ ఫీజు అడిగితే అది వంద శాతం మోసంగానే భావించాలని, కమీషన్ల కోసం బ్యాంక్ అకౌంట్లను, సిమ్ కార్డులను ఇతరులకు వాడటానికి ఇవ్వవద్దని సూచిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న 66 మందిని అరెస్ట్ చేసిన విషయం విధితమే.