పోలవరంతో సమస్యలే!

26-09-2026 | 05:00am
  1. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌పై తెలంగాణ ఆందోళన
  2. ముంపు, డ్రైనేజీ ముప్పుపై తక్షణ అధ్యయనం చేపట్టాలి
  3. కేంద్రానికి నీటిపారుదల శాఖ ఈఎన్సీ ఈ శ్రీధర్ లేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్(Polavaram Project Backwaters) కారణంగా తెలంగాణలో ఏర్పడే ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో ముంపు, డ్రైనేజీ సమస్యలు తలెత్తే అవకాశాలపై మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. సమస్య తీవ్రత దృష్ట్యా డ్రైనేజీ కంజెషన్ అధ్యయనాలను వేగవంతం చేసి, ముంపు ప్రాంతాలను ఖరారు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది.

ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్(Irrigation Department Secretary Sridhar) కేంద్రానికి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో తన బృందంతో కలిసి ఈ ఏడాది జూన్ 3న భద్రాచలం పరిసరాల్లో గోదావరి నది, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాలను పరిశీలించారని, పోలవరం పూర్తి రిజర్వాయర్ స్థాయి (ఎఫ్‌ఆర్‌ఎల్) 45.72 మీట ర్ల వద్ద నీటి నిల్వతో తెలంగాణలో ఏర్పడే ముంపు, బ్యాక్ వాటర్ ప్రభావం, స్థానిక వాగుల్లో డ్రైనేజీ కంజెషన్, అవుట్ ఫుల్ స్లూయిజ్‌ల పనితీరును పరిశీలించినట్లు లేఖలో తెలిపారు.

కిన్నెరసాని, పెదవాగు, ఎడులవా గు, తురుబాక, ఏటపాక తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించినట్లు పేర్కొన్నారు. అలాగే ఏటపాక, కొత్త కాలనీ, విస్టా కాంప్లెక్స్, సు భాష్‌నగర్ కాలనీల్లోని అవుట్ ఫుల్ స్లూయిజ్‌లు 45.72 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ కంటే దిగువన ఉన్న ట్లు గుర్తించినట్లు వెల్లడించారు. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణకు ఏర్పడే డ్రైనేజీ సమస్యలను అంచనా వేసేందుకు రాష్ట్రంలోని ఆరు వాగులపై అధ్యయనం చేపట్టాలని పీపీఏ, కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ)ని కోరినట్లు లేఖలో తెలిపారు.

ఇప్పటికే ఐదు వాగులకు సంబంధించిన క్రాస్ సెక్షనల్ సర్వే డేటాను సమర్పిం చినట్లు పేర్కొన్నారు. మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ అధికారులతోనూ పీపీఏ బృందం చర్చ లు జరిపిందని, బ్యాక్ వాటర్ ప్రభావంతో ప్లాంట్ కార్యకలాపాలు, మౌలిక వసతులపై పడే ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమైనట్లు తెలిపారు. భద్రా చలం, పినపాక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలను కూడా నమోదు చేసినట్లు వెల్ల డించారు.

తెలంగాణలో ముంపు పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున డ్రైనేజీ కంజెషన్ అధ్యయనాలను త్వరగా పూర్తి చేయడం, ముంపు ప్రాంతాల డిమార్కేషన్ ఖరారు చేయడం అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అవసరమైన ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణం, భూసేకరణ, పంపింగ్ ఏర్పాట్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టాలని కోరింది. ఈ అంశాలపై పీపీఏ సీఈవో కూడా క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సమస్యలను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, మౌలిక వసతుల పరిరక్షణకు సంబంధించిన అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం స్థాయిలో త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది.

మరిన్ని వార్తలు