చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పల్స్‌పోలియో కీలకం
పభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, జూన్ 28 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆదివారం నిర్వ హించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 391 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. పోలియో చుక్కలు పూర్తిగా సురక్షితమైనవని, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
శాతవాహన లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం ః అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుధ రాజేంద్ర
ముకరంపుర, జూన్ 28 (విజయక్రాంతి): పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో శాతవాహన లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని అదనపు డిఎంహెచ్‌ఓ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుధ రాజేంద్ర కొనియాడారు. ఆదివారం బుట్టి రాజారాం కాలనీ రూరల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పోలియో చుక్కల పంపిణీ సిబ్బందికి ఆహారపు ప్యాకెట్లు, మినరల్ వాటర్ బాటిల్స్, పెరుగు ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, ఇనుగుర్తి రమేష్, డి తిరుపతి రెడ్డి, ఎం మహేందర్, ఎన్ వేణుగోపాల్, ఎం ప్రవీణ్ కుమార్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యురాలు డాక్టర్ అలేఖ్య, పల్స్ పోలియో సిబ్బంది పాల్గొన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సుడా చైర్మన్
కరీంనగర్, జూన్ 28 (విజయక్రాంతి): నగరంలోని సుభాష్ నగర్ బిఆర్‌ఆర్ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యులు, పల్స్ పోలియో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
పిల్లల బంగారు భవితకు పోలియో చుక్కలే శ్రీరామ రక్ష ః కలెక్టర్
సిరిసిల్ల, జూన్ 28 (విజయక్రాంతి): ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అర్బన్ పీహెచ్సీలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగేంద్ర బాబు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
పిల్లల ఆరోగ్యం లక్ష్యం దిశగా పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరి ః రాజన్నాలయ ఈఓ రమాదేవి
వేములవాడ, జూన్ 28 (విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆలయ ఈఓ ఎల్. రమాదేవి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, ఆలయ ఉద్యోగులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






