ఫీజులు వాపస్ ఇవ్వండి
ఏడాదికి 5 శాతం ఫీజు పెంపు ఓకే!
మూడేళ్లకు 15 శాతం వసూలు మించొద్దు
ఎక్కువ వసూలు చేస్తే వెనక్కి ఇవ్వాల్సిందే
స్కూల్ యాజమాన్యాలకు పంజాబ్ ప్రభుత్వం ఆదేశం
చండీగఢ్, జూలై 14: పంజాబ్‌లో ప్రైవేటు స్కూళ్ల ఫీజుల పెంపునకు ప్రభుత్వం ముకుతాడు వేసింది. నిబంధనల ప్రకారం మూడేళ్లలో అంతకంటే ఎక్కువ వసూళ్లు చేసిన వారికి షాక్ ఇచ్చింది. ఏడాదికి 5 శాతం మాత్రమే ఫీజు పెంచుకోవచ్చని, మూడేళ్లకు 15 శాతాన్ని మించొద్దని, ఎక్కువ వసూలు చేస్తే వెనక్కి ఇవ్వాల్సిందేనని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు పంజాబ్ ప్రభుత్వం సీఎం భగవంత్‌మాన్ ఆదేశించారు.
‘పంజాబ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీస్ ఆఫ్ అన్‌ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్‌టిట్యూషన్స్ (సవరణ) ఆర్డినెన్స్ ఆ రాష్ట్రగవర్నర్ గులాబ్ చంద్ కఠారియా ఆమోదం తెలిపారు. ఈ చట్టం ప్రకారం ప్రతీయేటా ప్రైవేటు పాఠశాలలు కేవలం 5 శాతం ఫీజులను పెంచుకునే వెసులుబాటును కల్పించింది. అంతకంటే ఎక్కువగా పెంచితే తొలి ఉల్లంఘన కింద రూ. 50వేలు, రెండో ఉల్లంఘన కింద రూ. 1 లక్ష, మూడో ఉల్లంఘన కింద రూ. 5 లక్షలు జరిమానా విధించనుంది.
ఆ తరువాత కూడా ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే పాఠశాల గుర్తింపును రద్దు చేయనుంది. చట్టం అమలు చేయడం పట్ల గవర్నర్‌కు సీఎం భగవంత్‌మాన్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. విద్యను ఒక వ్యాపారంగా మారడానికి తమ ప్రభుత్వం అనుమతించదని, ఫీజుల పేరుతో ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న దోపిడీని అరికట్టేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు గత నాలుగేళ్ల ఫీజు రికార్డులను పదిరోజుల్లోగా సమర్పించాలని సీఎం భగవంత్‌మాన్ ఆదేశించారు. అమృత్‌సర్‌లో ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఇటీవల 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య ఘటనను కూడా సీఎం భగవంత్ మాన్ ప్రస్తావించారు. ఈ ఘటన తరువాత తల్లిదండ్రుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తచట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.






