1 June, 2026 | 2:06 AM

మోకిలాలో ‘క్వాంటియం ఇంటర్నేషనల్ స్కూల్’

01-06-2026 01:19 AM

ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల

శంకర్‌పల్లి, మే 31(విజయక్రాంతి): రాష్ట్ర విద్యా రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఎక్స్లలేన్సియ గ్రూప్స్, రంగారెడ్డి జిల్లా మోకిలలో నిర్మించిన ప్రపంచ స్థాయి విద్యాసంస్థ ‘క్వాంటియం ఇంటర్నేషనల్ స్కూల్’ ప్రారంభోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలను ప్రారంభించారు.

ఈ వేడుకల్లో మల్కాజిగిరి, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, మాధవనేని రఘునందన్ రావు, డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, పలువురు విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఇటువంటి అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు కీలకపాత్ర పోషిస్తాయని కొనియాడా రు.

సమాజ సమిష్టి అభివృద్ధికి నాణ్యమైన విద్య ఎంతో అవసరమని, ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను అందిస్తూ విద్యార్థులను భావి భారత నాయకులుగా తీర్చిదిద్దే దిశగా క్వాంటియం ఇంటర్నేషనల్ స్కూల్ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

పాఠశాల నిర్వాహకులు మాట్లాడు తూ ఆధునిక మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన విధానాలు, విద్యార్థుల సమగ్ర వికాసానికి (ఓవరాల్ డెవలప్‌మెంట్) అవసర మైన అత్యుత్తమ వాతావరణాన్ని ఈ పాఠశాల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యా రంగ ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.