8 April, 2026 | 12:27 PM

చైనా రోబో వివాదం.. భారత్ నవ్వులపాలైందని రాహుల్ గాంధీ ఆగ్రహం

19-02-2026 03:03 AM

అంతర్జాతీయ స్థాయిలో భారత్ నవ్వులపాలు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: చైనా ఉత్పత్తులను భారత్ ఆవిష్కరణలుగా ప్రచారం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ నవ్వులపాలైందని విమర్శించారు.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఏఐ సమ్మిట్ వేదికగా చైనా రోబోను ప్రదర్శించడం రాజకీయ దుమారానికి దారితీసింది.  గల్గోటియాస్ యూనివ ర్సిటీ ’ఓరియన్’ పేరుతో ఒక నిఘా రోబోను ప్రదర్శించింది. దీనిని తమ సొంత ఆవిష్కరణగా ప్రొఫెసర్ నేహా సింగ్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇది చైనాకు చెందిన ’యూనిట్రీ గో-2’ రోబో అని తేలింది.

గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన రోబోడాగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. భారతీయ ఇంజనీర్ల ఘనత అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోబో వీడియోను షేర్ చేయడంపై  ఆయన మండిపడ్డారు. ఈ సమ్మిట్‌ను ఒక అస్తవ్యస్తమైన పీఆర్ విన్యాసమని అభివర్ణించారు. భారతీయ ప్రతిభను, డేటాను ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.  దేశ డేటాను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. చైనాలోనూ భారత్ హేళనకు గురవుతోందన్నారు.