ఎన్నికల డేటాను ఈసీ ఎందుకు ఇవ్వట్లేదు?
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) అన్నారు. అంచనాలకు అందని విధంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయన్నారు. హరియాణా, మధ్యప్రదేశ్ లోనూ అంచనాలకు అందని ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అనేక ఎన్నికల ఫలితాలపై తాము పరిశోధన చేశామని, పరిశోధనలో తమ అనుమానాలు చాలా వరకు నిజమయ్యాయని రాహుల్ గాంధీ తెలిపారు.
మహారాష్ట్రలో ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. ఐదేళ్లలో నమోదైన వారికంటే.. ఐదు నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కవని ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలో సాయంత్రం 5 తర్వాత విపరీతంగా పోలింగ్ నమోదైందని చెప్పారు. మహారాష్ట్రలో లోక్ సభ, విధాన సభ ఎన్నికల మధ్య సమయంలో కోటి మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. ఓటర్ల జాబితా తమకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని ఆరోపించారు. ఓటర్ల జాబితా దేశ సంపద.. దానిని ఎందుకు చూపించట్లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఓటర్ల జాబితాను విశ్వేషించే హక్కు తమకు ఉందని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల పరిణామాలతో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని అర్థమైదని తెలిపారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల ఎలక్ట్రానిక్ డేటాను ఈసీ తమకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్నికల్లో చోరీ(Vote Chori) జరిగిందన్న తమ అనుమానాలను మహారాష్ట్ర ఫలితాలు రూఢీ చేశాయన్నారు. కర్నాటక లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని అంచనా వేసుకున్నామని రాహుల్ వివరించారు. తమ అంచనాలను పటాపంచలు చేస్తూ కర్నాటక లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిదే గెలిచిందని తెలిపారు. బెంగళూరు సెంట్రల్ ఎంపీ సీటు సహా 7 చోట్ల అనూహ్యంగా ఓడిపోయామని స్పష్టం చేశారు. బెంగళూరు సెంట్రల్ లోని మహదేవ్ పూర్ అసెంబ్లీ స్థానంలో పరిశోధన చేశామని రాహుల్ తెలిపారు. బెంగళూరు సెంట్రల్ లో 32,707 ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. ఒక్క మహదేవ్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లోనే బీజేపీకి 14,14,046 ఓట్లు మెజార్టీ వచ్చిందని స్పష్టం చేశారు. మహదేవ్ పూర్ లో లక్షకు పైగా ఓట్ల చోరీ జరిగిందన్నారు. మహదేవ్ పూర్ లో దాదాపు 12 వేల మంది నకిలీ ఓటర్లు వచ్చారని చెప్పారు.
మహదేవ్ పూర్ లో 40 వేలకు పైగా ఓటర్లకు నకిలీ ఐడీలు, అడ్రస్ లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. మహదేవ్ పూర్ లో ఒకే చిరునామాతో 10,452 ఓట్లు ఉన్నాయి.. తప్పుడు ఫోటోలతో 4,132 ఓట్లున్నాయి. మహదేవ్ పూర్ లో ఫామ్-6 ను తప్పుగా వాడి 33,692 ఓట్లు వేశారని ఆరోపించారు. ఒకే ఫోటోతో ఉన్న ఓటర్ల వివరాలను రాహుల్ గాంధఈ ప్రదర్శించారు. ఆదిత్య శ్రీవాస్తవ అనే వ్యక్తి కర్నాటక, యూపీ, మహారాష్ట్రలో ఓటు ఉంది. ఒకే వ్యక్తికి పలు రాష్ట్రాల్లో ఓటు ఉన్నవారు వేల సంఖ్యలో ఉన్నారని తెలిపారు. మహదేవ్ పూర్ లో 0 ఇంటి సంఖ్యతో కొన్ని వందల ఓట్లు ఉన్నాయని వివరించారు. తండ్రి పేరు స్థానంలో ఇష్టానుసారం ఆంగ్ల అక్షరాలు ముద్రించారు.హెచ్ హెచ్ జీజీఎస్ఎస్ ఆంగ్ల అక్షరాలు ముద్రించారని తెలిపారు. తమ ఆరోపణలను అన్ని ఆధారాలతో బయటపెడుతున్నాయని పేర్కొన్నారు. ఒకే ఇంటి సంఖ్యతో 80 ఓటర్లు ఉన్న ఇళ్లు కూడా ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు.






