17 April, 2026 | 6:23 PM

రూ.43 వేలకోట్లతో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి

23-05-2025 12:29 AM
  1. ఈ ఏడాది బడ్జెట్‌లో 5,300 కోట్ల కేటాయింపు 
  2. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ
  3. అట్టహాసంగా వరంగల్ రైల్వేస్టేషన్ ప్రారంభం
  4. కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి
  5. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్ (మహబూబాబాద్), మే 22 (విజయక్రాంతి): తెలంగాణలోని రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్య మిస్తోందని, ఇందులో భాగంగా 2014 తర్వాత రూ.43 వేల కోట్లు కేటాయించిందని, ఈ ఏడాది రూ.5,300 కోట్లతో అభి వృద్ధి పనులు చేపట్టామని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.

అమృత్ భారత రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో ఆధునికరించిన వరంగల్ రైల్వేస్టేషన్‌ను గురు వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎంపీలు కడియం కావ్య, ఈటల రాజేందర్, డీకే అరుణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో రాజకీయాలను పక్కనబెట్టి అంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాకతీయుల చరిత్రను చా టి చెప్పేలా వరంగల్ రైల్వే స్టేషన్ ఆకృతిని రూపొందించినట్టు చెప్పారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దక్షిణాదికి, ఉత్తరాదికి మధ్య వార ధిగా, అతిపెద్ద జంక్షన్‌గా గుర్తింపు పొందిన కాజీపేటలో రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని, అలాగే హైదరాబాద్ మెట్రో మలిదశ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని తెలిపారు.

కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించడం వల్ల ఈ ప్రాం తం రైల్వేపరంగా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. కాజీపేట రైల్వేస్టేషన్ వద్ద బస్టాండ్ నిర్మాణం, ఆర్‌వోబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కాజీపేట మోడల్ స్టేషన్ అభివృద్ధి పనులు సగంలోనే ఆగిపోయాయని, మిగిలిన పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల విషయంలో తాము కృషి చేశామంటే తా ము కృషి చేశామని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎవరికివారు ప్రకటించడంతో వాగ్వాదం చోటుచేసుకొని ఘర్షణకు దారితీసింది. వెం టనే పోలీసులు స్పందించి ఇరువర్గాలను శాంతింపజేశారు. దీంతో కొంతసేపు వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.