08-02-2026 12:00:00 AM
పంజాగుట్ట, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో మాతా రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. శనివారం నిర్వహించిన వేడుకల సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన మహోన్నత పోరాటంలో రమాబాయి పాత్ర అజరామరమని కొనియాడారు. సామాజిక సంస్కరణలు, మహి ళా హక్కులు, విద్య ప్రాముఖ్యతపై ఆమె చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు.
అంబేద్కర్ విదేశాలలో ఉన్నత చదువులు చదువుతున్న సమయంలో రమాబాయి అనేక కష్టాలను అనుభవిస్తూనే ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె త్యాగనిరతి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంఎస్డబ్ల్యూ విద్యాసాగర్, ఎల్. సేవా నాయక్, జె. వెంకట రత్నం, గద్దర్, జయపాల్, వీ. రవి, వీ జవహర్లాల్, ఎన్. బాల రాం, బి. ప్రియాంక, సరిత, ఇతర ఆసుపత్రి సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.