12 March, 2026 | 4:49 AM

త్యాగానికి, సోదరభావానికి ప్రతీక రంజాన్

12-03-2026 01:15 AM

ఇఫ్తార్ విందులో కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్, మార్చి 11 (విజయక్రాంతి) : పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, త్యాగానికి, సోదరభావానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం చందా (టి) మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కిచెన్, స్టోర్ గదిని పరిశీలించి, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.  అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఇఫ్తార్ విందును ఆరగించారు.

ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ...  మైనారిటీ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని, ముఖ్యంగా రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులకు, విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని, త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ కలీమ్, ప్రిన్సిపాల్స్ ఆసిఫ్, నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.