సింగరేణితో రామప్పకు ముప్పు!

11-09-2026 | 05:30am

ములుగు జిల్లా(Mulugu District)లోని వెంకటాపూర్‌లో సింగరేణి సంస్థ ప్రతిపాదించిన ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని(Opencast coal mine) మూలంగా తెలంగాణ రాష్ట్రం(Telangana State)లోని ప్రపంచ వారసత్వ కట్టడం(World Heritage Site) రామప్ప ఆలయానికి(Ramappa Temple) ముప్పు ఉన్నదని కాకతీయ హెరిటేజ్ సంస్థ(Kakatiya Heritage Trust) ఆందోళన వ్యక్తం చేసింది. సమీపంలోని రామప్ప చెరువుపై కూడా 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరుపనున్న ఈ గని ప్రభావం చూపుతుందని, కాబట్టి ఈ గని తవ్వకాలను నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు బొగ్గు గనుల పనుల కార్యకలాపాల నిలిపివేయడానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి(Kishan Reddy)కి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా...

శ్రీ జీ కిషన్‌రెడ్డి,

గౌరవనీయ కేంద్ర బొగ్గు, గనుల శాఖ 

మంత్రి, భారత ప్రభుత్వం

విషయం: ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యూనెస్కో గుర్తించిన రామప్ప ఆలయం, రామప్ప చెరువుపై ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌లోని ప్రతిపాదిత పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ప్రభావం, గనుల కార్యకలాపాల నిలిపివేత కోసం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి.

ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపూర్ గ్రామంలో 300 మీటర్ల లోతుతో ఓపెన్‌కాస్ట్ గనిని(Opencast coal mine) ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ ప్రతిపాదించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయానికి దిగువన సుమారు 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రతిపాదిత బొగ్గు గని ఉంది. ఈ ఓపెన్‌కాస్ట్ గని పనులను ప్రారంభించేందుకు ఎన్వోసీ కోసం సింగరేణి సంస్థ(Singareni Company) గతంలో పాలంపేట ప్రత్యేక అభివృద్ధి సంస్థ(Palampet Special Development Organization) (పీఎస్‌డీఏ)ను సంప్రదించిన విషయం తెలిసిందే. 01.03.2023న ములుగులో జరిగిన పీఎస్‌డీఏ సమావేశంలో ఎన్‌ఓసీ ఇవ్వడాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యతిరేకించింది.

ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ గనుల కారణంగా ప్రజల జీవనాధారమైన రామప్ప చెరువుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ఉన్న ఏకైక ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయం ధ్వంసమవుతాయని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందేలా పురావస్తు శాఖ, తెలంగాణ వారసత్వ శాఖలతో కలిసి కృషి చేసిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ గట్టిగా విశ్వసిస్తున్నది.

‘యునెస్కో గుర్తించిన రామప్ప ఆలయం, రామప్ప చెరువులపై సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల ప్రభావం’ అనే పేరుతో ఓపెన్‌కాస్ట్ గని వల్ల కలిగే దుష్పరిణామాలపై కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సమగ్ర విశ్లేషణాత్మక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను మీ పరిశీలన కోసం సమర్పిస్తున్నాం. గొప్ప వారసత్వ నిర్మాణాలైన రామప్ప చెరువు, రామప్ప ఆలయాలను కాపాడేందుకు సింగరేణి గనుల కార్యకలాపాలను చేపట్టకుండా అడ్డుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము.

ఓపెన్‌కాస్ట్ గనుల ప్రభావం

11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలోని ఓరుగల్లు ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు ప్రజాహిత పాలకులు. వారు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, అద్భుతమైన ఆలయాలను నిర్మించారు. ఇవి దాదాపు వెయ్యేళ్లుగా మనుగడలో ఉన్నాయి. నేటికీ తెలంగాణ వ్యాప్తంగా తాగు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న జలవనరుల ప్రాజెక్టుల రూపంలో ఆ గొప్ప పాలకుల వారసత్వాన్ని మనం అనుభవిస్తున్నాం. భౌగోళిక ఇంజినీరింగ్, నిర్మాణ సాంకేతికత, వాటి నిర్మాణంలో ఉపయోగించిన పదార్థాలు, ముఖ్యంగా రామప్ప ఆలయంలోని తేలియాడే రాళ్లు, శిల్పాలు నాటి శిల్పుల నైపుణ్యానికి, సృజనాత్మకకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా కల్పించేందుకు భారత పురావస్తు సంస్థ, తెలంగాణ వారసత్వ శాఖ, జిల్లా యంత్రాంగంతో కలిసి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ దశాబ్దానికి పైగా నిరంతరంగా కృషి చేసింది. ఈ కృషి ఫలితంగా 2021 జూలై 25న రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ రామప్ప ఆలయానికి సంబంధించి ఒక సమగ్ర నివేదికను పారిస్‌లోని ఐకోమోస్ సంస్థ ముందుంచింది. ఆలయంలోని తేలియాడే రాళ్లను ప్రదర్శించగా, కమిటీ దానిని ఎంతగానో ప్రశంసించింది.

యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం సింగరేణి ఓపెన్‌కాస్ట్ గని వల్ల ఇప్పుడు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నది. ప్రతిపాదిత ఈ ప్రాంతం ప్రాణహిత -గోదావరి బేసిన్ పరిధిలో ఉంది. ఇది పాఖల్, సుల్లవాయి, దిగువ, ఎగువ గోండ్వానా నిర్మాణాలతో కూడిన నాలుగు ప్రత్యేక అవక్షేపణ చక్రాలను కలిగి ఉంది. వీటిలో ఇసుకరాళ్లు, షేల్స్, కాంగ్లోమెరేట్స్ తదితర పదార్థాలతోపాటు బొగ్గు నిల్వల నిర్మాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో చిన్న, పెద్ద స్థానభ్రంశాలతోపాటు మొత్తం ప్రాంతాన్ని దాటుతూ అనేక జాయింట్లతో కూడిన భౌగోళిక నిర్మాణపరమైన అస్థిరత ఉంది. ముఖ్యంగా అనేక జాయింట్లు, పగుళ్లతోపాటు భూగర్భ పొరల వాలు దిశ కూడా ఈశాన్యం వైపు ఉంది.

రామప్ప చెరువులోని నీటిమట్టం ఈ రేఖాంశాలు, భ్రంశాలు, పొరల మధ్య ఉన్న జాయింట్ల ద్వారా భూగర్భ జలాలు ప్రవహించే వేగంపై (హైడ్రాలిక్ గ్రేడియంట్) ప్రభావం చూపుతుంది. వెంకటాపూర్‌లో ప్రతిపాదించిన 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గని వరకు ఈ ప్రభావం ఉంటుంది. (జీఎస్‌ఐ నివేదికలోని 22వ పేజీ)

మట్టి కట్టతో నిర్మించిన రామప్ప చెరువు నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. ఇది సుమారు 30 వేల ఎకరాల భూమికి సాగునీరు అందించగలదు. ఈ చెరువుకు కట్ ఆఫ్ ట్రెంచ్ (సీవోటీ) లేదు. రామప్ప చెరువుకు దిగువన ప్రతిపాదించిన 300 మీటర్ల లోతైన ఓపెన్‌కాస్ట్ గని కారణంగా ఏర్పడే అధిక హైడ్రాలిక్ గ్రేడియంట్ వల్ల సీపేజ్‌లు ఏర్పడే అవకాశం ఉంది.

ఆలయ పునాది కోసం నిర్బంధిత ఇసుక పెట్టె వంటి నిర్మాణాన్ని ఉపయోగించారు. రామప్ప చెరువు, ఆలయం మీదుగా పరస్పరం అనుసంధానమైన రేఖాంశాలు వ్యాపించి ఉండటంతో ఈ ఇసుక పెట్టె లాంటి నిర్మాణం పైపింగ్ పరిణామం వల్ల ప్రభావితమై ఉండవచ్చు. (జీఎస్‌ఐ నివేదిక, 21వ పేజీ)

అయితే, నివేదిక ప్రకారం రామప్ప ఆలయంపై పేలుళ్ల ప్రభావం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో నిరంతరం ఏర్పడే ప్రకంపనలు ఈ ఆలయంపై ప్రభావాన్ని చూపుతాయి. రంగా మండపంలో ఇప్పటికే పగుళ్లు, కుంగుబాటు రూపంలో ఆలయం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. గతంలో ఈ ప్రాంతంలో సంభవించిన వివిధ భూకంపాల కారణంగా ఇది ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.

నిర్బంధిత ఇసుక పెట్టె వంటి పునాదిపై ఆలయాన్ని నిర్మించిన కాకతీయులు ఇందులోని ఇసుక దాని పూర్తి సాంద్రతకు చేరేలా కుదించారు. ఆ ఇసుక నిర్బంధ స్థితిలో ఉన్నంతకాలం 800 సంవత్సరాలకు పైగా చెక్కు చెదరకుండా ఉన్న పైభాగ నిర్మాణ భారాన్ని పునాది మోస్తుంది. అయితే ప్రకృతి వైపరీత్యాలు, భూగర్భ జలాల హెచ్చుతగ్గులు, రేఖాంశాలు, భూకంపాల ప్రభావం కారణంగా కొంత వరకు భౌగోళిక అస్థిరత ఏర్పడింది. ఫలితంగా ఆలయం అసమానంగా కుంగిపోవడంతోపాటు పశ్చిమం వైపు వంగినట్లు కనిపిస్తున్నది. అయితే, గని పనులు చేపడితే ఆ పేలుళ్ల ప్రభావం ఆలయంపై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయం.

300 మీటర్ల లోతుతో ప్రతిపాదించిన ఓపెన్‌కాస్ట్ గని కారణంగా రామప్ప చెరువుపై ఏర్పడే హైడ్రాలిక్ గ్రేడియంట్‌తోపాటు పేలుళ్ల ప్రభావం ఆలయ స్థిరత్వంపై తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. జీవవైవిధ్యం, సామాజిక- పరిస్థితులతోపాటు రామప్ప ఆలయం, రామప్ప చెరువుతో ప్రజలకు ఉన్న సామాజిక, సాంస్కృతిక, మతపరమైన అనుబంధాలపైనా ఓపెన్‌కాస్ట్ గని తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

అంతిమంగా, ఓపెన్‌కాస్ట్ గని వల్ల పైపింగ్ పరిణామం ఏర్పడి, పగుళ్ల ద్వారా రామప్ప చెరువులోని నీరు బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. ఫలితంగా చెరువు కట్ట తెగిపోయి రామప్ప ఆలయం కూలిపోవడంతోపాటు పరిసర గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది. ఇది సునామీ వంటి విపత్తుకు దారితీసి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం లేకపోలేదు. 

ఈ నేపథ్యంలో ప్రజల సామాజిక, సాంస్కృతిక భావోద్వేగాలను గౌరవించి, ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ గని కార్యకలాపాలను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. గొప్ప వారసత్వ కట్టడాలైన రామప్ప ఆలయం, రామప్ప చెరువులను కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. పైన పేర్కొన్న విషయాలను నిర్ధారించేందుకు రామప్ప చెరువు, చెరువుకు దిగువ ప్రాంతం, రామప్ప ఆలయం, ఆ తర్వాత సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదించిన సింగరేణి కాలరీస్ ఓపెన్‌కాస్ట్ గని ప్రాంతాన్ని సూచించేలా రూపొందించిన ఈ ప్రాంతపు పటాన్ని జత చేస్తున్నాం.

కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు

 బీవీ పాపారావు, ఐఏఎస్ (రిటైర్డ్)

 ప్రొ.ఎం పాండురంగారావు 

(పిహెచ్.డి)

 బీపీ ఆచార్య ఐఏఎస్ (రిటైర్డ్)

 జే శ్రీధర్‌రావు ఎం.ఏ, ఎం.ఫిల్

మరిన్ని వార్తలు