5 September, 2026 | 5:51 AM

లోయర్ ట్యాంక్‌బండ్‌లో జోరుగా అక్రమ పార్కింగ్

05-09-2026 | 04:50am

ఎమ్మార్వో ఆఫీస్ పరిసరాల్లో రోడ్డుపైనే వాహనాల నిలిపివేత

తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు 

ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

చోద్యం చూస్తున్న అధికారులు

ముషీరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): లోయర్ ట్యాంక్బండ్లోని తహసీల్దార్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అక్రమ పార్కింగ్లు(Illegal Parking) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను విచ్చలవిడిగా నిలిపివేస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారిపైనే వాహనాలను పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

రోడ్డుకిరువైపులా కార్ డెంటింగ్ వర్క్స్ 

అక్రమ పార్కింగ్కు తోడు రోడ్డుకిరువైపులా కార్ డెంటింగ్, రిపేర్ పనులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనాల మరమ్మతులకు సంబంధించిన పనులు రహదారి పక్కనే కొనసాగుతుండటంతో రోడ్డు స్థలం మరింత కుదించుకుపోతోంది. దీంతో ఒకవైపు పార్కింగ్ చేసిన వాహనాలు, మరోవైపు డెంటింగ్ వరక్స్ కారణంగా ప్రయాణికులకు రాకపోకలు కష్టతరంగా మారుతున్నాయి.

తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు

రోడ్డుపై వాహనాల అక్రమ పార్కింగ్ కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలకు మార్గం సరిగా కనిపించకపోవడం, వాహనదారులు ఒక్కసారిగా లేన్ మార్చాల్సి రావడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో తరచూ  రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాదచారులు సైతం రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చోద్యం చూస్తున్న ట్రాఫిక్ పోలీసులు?

అక్రమ పార్కింగ్లపై చర్యలు తీసుకోవాల్సిన ట్రాఫిక్ పోలీసులు తగిన స్థాయిలో స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నిలిపివేస్తున్నప్పటికీ వాటిని తొలగించేందుకు లేదా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకు రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వ్యాపార సముదాయాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

రోడ్డు ఇరువైపులా రహదారిని ఆక్రమించి నిర్వహిస్తున్న కార్ డెంటింగ్, ఇతర వ్యాపార కార్యకలాపాలను అధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారి వినియోగానికి ఆటంకం కలిగించే అక్రమ పార్కింగ్లను తొలగించడంతో పాటు, రోడ్డును ఆక్రమించి కొనసాగుతున్న వ్యాపార కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

లోయర్ ట్యాంక్బండ్ ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ పార్కింగ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, రహదారిపై వాహనాలను నిలిపివేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి రహదారులకు అడ్డుగా ఉన్న ఆక్రమణలు, అక్రమ పార్కింగ్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు