10 June, 2026 | 6:47 PM

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం

10-06-2026 06:09 PM

- కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్

బూర్గంపాడు,(విజయక్రాంతి): రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, ఏఐసీసీ సభ్యురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్ తీవ్రంగా ఖండించారు. బూర్గంపాడు ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, ఇది కేవలం సాంకేతిక లోపం పేరుతో తీసుకున్న నిర్ణయం కాదని భజన సతీష్ ఆరోపించారు.

అఫిడవిట్‌లో కేసు ప్రస్తావన లేకపోవడాన్ని కారణంగా చూపి నామినేషన్‌ను తిరస్కరించారని, అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థికి సవరణ చేసుకునే అవకాశం కల్పించాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగానే ఆ అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో వాటి ప్రభావాన్ని తట్టుకోలేక రాజకీయ ప్రత్యర్థులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుతో ప్రజల విశ్వాసాన్ని పొందుతోందని, ఆ ప్రజాదరణను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు సర్పంచ్ మంద నాగరాజు,ఉప సర్పంచ్ గుండె వెంకన్న,పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎడమ కంటి సుధాకర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల హరిష్ యాదవ్, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దునుకు రాము,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్  సాయి తదితరులు పాల్గొన్నారు.