2 September, 2026 | 1:43 AM

హైడ్రా కమిషనర్‌కు ఊరట

02-09-2026 | 12:57am
  1. రంగనాథ్‌ను పదవి నుంచి తప్పించాలన్న ఆదేశాలు నిలుపుదల
  2.    119 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదం 
  3. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే
  4. విచారణ నవంబర్ 3కు వాయిదా 

సికింద్రాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) పరిధిలోని జీఎల్‌ఆర్ 243లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూముల పరిరక్షణ(Land Conservation) విషయంలో హైడ్రా(Hydra)కు తెలంగాణ హైకోర్టు(v)లో భారీ ఊరట లభించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌(AV Ranganath)ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం నిలిపివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. హైడ్రా కమిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ శక్దర్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేసింది. తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.  

కేసు పూర్తి వివరాలు ఇవీ..

జీఎల్‌ఆర్ 243 సర్వే నంబర్‌లో సుమారు 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వీటిని బీ-2 భూములుగా పేర్కొంటున్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు తదితర రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ వీటిని కేటాయించింది. ఈ భూములకు హక్కుదారు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా, వాటి పరిరక్షణ బాధ్యతలను కూడా తెలంగాణ సర్కార్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జూలై 18న  119 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.

గూగుల్ ఎర్త్‌లో భూముల సరిహద్దులను స్పష్టంగా గుర్తిస్తూ కేఎంఎల్ ఫైల్‌ను కూడా అందించింది.  అయితే మేడ్చల్-- మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం లోతుకుంటలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న ప్రైవేటు భూములకు, జీఎల్‌ఆర్ 243లోని 119 ఎకరాల ప్రభుత్వ భూమికి మధ్య సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉందని హైడ్రా వాదిస్తోంది. లోతుకుంట సర్వే నంబర్లు 1, 2లో అనుమతులు పొందినట్లు పేర్కొంటూ శాంతశ్రీరాం కనస్ట్రక్షన్స్ జీఎల్‌ఆర్ 243లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడుతోందని హైడ్రా ఆరోపిస్తోంది.

ప్రభుత్వ భూమిని తమదిగా పేర్కొంటూ సంబంధిత సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో పాటు హైడ్రాపై, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పైనా కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సింగిల్ జడ్జి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తప్పించి, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అయితే, సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఏవీ రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. మంగళవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి ఆదేశాల అమలును నిలిపివేసింది.