16 July, 2026 | 12:11 PM

ఆరోగ్య బీమాకు వయో పరిమితి తొలగింపు

21-04-2024 12:05 AM

ఆరోగ్య బీమా పాలసీలపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ)  వయో పరిమితిని తొలగించింది. ఇప్పటివరకూ వ్యక్తిగత పాలసీదారులు 65 ఏండ్ల వయస్సు వరకే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలన్న నిబంధన ఉన్నది. వయస్సుతో నిమిత్తంలేకుండా ప్రతీఒక్కరూ ఆరోగ్యబీమా కొనుగోలుకు ఆర్హులను 

చేస్తూ తాజాగా ఐఆర్‌డీఏ నోటిఫికేషన్ 

జారీచేసింది.  ఈ మార్పు 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. 

అనువైన పాలసీలు తీసుకురావాలి

సీనియర్ సిటిజన్లకు అనువైన పాలసీలను రూపొందించాలని  బీమా కంపెనీలను రెగ్యులేటర్ ఆదేశించింది. పెద్ద వయస్కులవారి క్లెయింలు, వివాదాల పరిష్కారానికి ప్రత్యేకమైన చానల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఐఆర్‌డీఏ తాజా నిర్ణయంతో 65 ఏండ్లు పైబడినవారికి ఆరోగ్య బీమా మార్గం సుగమమయ్యిందని, ఇక మీదట ఈ వయస్సువారికి ఇన్సూరెన్స్ సంస్థలు వాటి బోర్డుల ఆమోదిత అండర్‌రైటింగ్ గైడ్‌లైన్స్‌ను అమలు చేస్తాయని పరిశ్రమ నిపుణుడు ఒకరు వివరించారు. సీనియర్ సిటిజన్లకు అందుబాటు ప్రీమియంలో, ఇన్సూరెన్స్ కంపెనీలకు గిట్టుబాటు అయ్యేలా బీమా కవరేజ్ ఇచ్చే పాలసీలు రూపొందుతాయన్నారు. 

వెయిటింగ్ పిరియడ్ తగ్గింపు

అలాగే ఆరోగ్య బీమా వెయిటింగ్ పిరియడ్‌ను 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గించింది. అంటే బీమా తీసుకున్నప్పుడు పాలసీదారు తనకున్న వ్యాధుల్ని వెల్లడించినా, వెల్లడించకపోయినా ఆ వ్యాధులపై క్లెయింలను 36 నెలల తర్వాత కంపెనీలు తిరస్కరించరాదని ఐఆర్‌డీఏ ఆదేశించింది. అలాగే క్యాన్సర్, గుండెవ్యాధులు, ఎయిడ్స్ తదితర ప్రాణాంతక వ్యాధులు ఉన్నవారికి పాలసీల జారీని తిరస్కరించరాదని తాజా నోటిఫికేషన్‌లో బీమా సంస్థలను ఆదేశించింది.