16 July, 2026 | 11:47 AM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభం రూ. 16,512

21-04-2024 12:15 AM

షేరుకు రూ.19.50 డివిడెండు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20:  దేశీయ ప్రైవేటు రంగంలో టాప్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆకర్షణీయమైన క్యూ4 ఫలితాల్ని వెల్లడించింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ స్టాండెలోన్ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 37 శాతం వృద్ధితో రూ. 16,512 కోట్లకు చేరింది. అయితే గత డిసెంబర్ త్రైమాసికంలోనే దాని మాతృసంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ) విలీనమైనందున 2023 క్యూ4 ఫలితాలతో ప్రస్తుత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫలితాల్ని పోల్చడం సరికాదు. 2023 డిసెంబర్ త్రైమాసికంలో ఆర్జించిన రూ.16,373 కోట్లకంటే తాజా త్రైమాసికంలో బ్యాంక్ నికరలాభం స్వల్పంగా వృద్ధిచెందింది. రూ.17,622 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని నమోదు చేసింది. శనివారం సమావేశమైన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.19.50 చొప్పున డివిడెండును సిఫార్సుచేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.64,060 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు బ్యాంక్ తెలిపింది. శుక్రవారం బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు  2.46 శాతం పెరిగి రూ.1,531 వద్ద ముగిసింది. 

స్వల్పంగా పెరిగిన నికర ఎన్‌పీఏలు

సమీక్షా త్రైమాసికంలో బ్యాంకు ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉంది. మార్చి క్వార్టర్లో స్థూల మొండి బకాయిలు 1.24 శాతంకాగా, అంతక్రితం డిసెంబర్ త్రైమాసికంలో ఇవి 1.26 శాతం. కానీ నికర ఎన్‌పీఏలు 0.31 శాతం నుంచి 0.33 శాతానికి చేరాయి. పరిమాణంలో చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ.31,173 కోట్లు, నికర ఎన్‌పీఏలు రూ.8,091 కోట్లుగా ఉన్నాయి. 

నికర ఆదాయం రూ.47,240 కోట్లు

తాజాగా ముగిసిన త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.47,240 కోట్ల నికర ఆదాయం ఆర్జించింది. ఇందులో సబ్సిడరీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటా విక్రయం ద్వారా ఒనగూడిన రూ.7,340 కోట్ల ఆదాయం సైతం ఉంది. క్యూ4లో బ్యాంక్  నికర వడ్డీ ఆదాయం (వసూలైన, చెల్లించిన వడ్డీ మధ్య వ్యత్యాసం) రూ.29,080 కోట్లకు పెరగ్గా, ఇతర ఆదాయం రూపంలో రూ.18,170 కోట్లు సంపాదించింది. 3.44 శాతం నికర వడ్డీ మార్జిన్లను బ్యాంక్ సాధించింది.