ఈ బ్యాంక్ షేర్లకు ఓటు
తాజా మార్కెట్ పెట్టుబడులపై నిపుణుల విశ్లేషణలు
ప్రధాన స్టాక్ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు కొద్ది రోజుల క్రితమే ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరినప్పటికీ, బ్యాంక్ షేర్లు ఇప్పటివరకూ వెనుకంజ వేస్తూ వచ్చాయి. అయితే నాటకీయంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హఠాత్తు ర్యాలీతో ఎట్టకేలకు రెండు వారాల క్రితం బ్యాంక్ నిఫ్టీ సైతం 48,600 పాయింట్ల వద్దకు చేరి కొత్త రికార్డును నెలకొల్పింది. అయితే కొద్ది నెలలుగా మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు ర్యాలీ జరపగా, ప్రైవేటు రంగ బ్యాంక్‌లు పీఎస్‌యూలకంటే వెనుకబడ్డాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 5 శాతం క్షీణించగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 17 శాతం పెరిగింది.ఏడాది ట్రెండ్ చూసినా ఇదే తీరులో ఉంది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 82 శాతం ర్యాలీ జరపగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ పెరుగుదల 20 శాతానికే పరిమితమయ్యింది. ఈ కాలంలో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 19 శాతం మేర పెరిగింది.
ఏ బ్యాంక్ ఎంతెంత?..
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ 9 శాతం పెరగ్గా, ఇండెక్స్‌లోని మిగిలిన ప్రైవేటు బ్యాంక్‌లన్నీ క్షీణించాయి. బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు అత్యధికంగా 20 శాతం నష్టపోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 10 శాతం పడిపోయింది. మిగిలిన ప్రైవేటు బ్యాంక్‌లు 4.5 శాతం నుంచి 13 శాతం మధ్య తగ్గాయి. మరోవైపు పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ భారీగా 34 శాతం లాభపడింది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 31.5 శాతం ఎగసింది. ఇండెక్స్‌లోని ఇతర పీఎస్‌యూ బ్యాంక్‌లు 8 శాతం మధ్య పెరిగాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు నిపుణుల అంచనాలివే...
టాప్ పిక్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్బీఐ
ప్రైవేటు విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పీఎస్‌యూ స్పేస్‌లో ఎస్బీఐలు మా టాప్ పిక్స్. వీటిలో రిస్క్ రివార్డ్ రేషియో ఆకర్షణీయంగా ఉంది.
జిగ్నేష్ షా, ఇన్‌క్రెడ్ క్యాపిటల్






