అమెరికా ఆర్మీ చీఫ్ తొలగింపు
రాండీ జార్జ్‌ను బలవంతంగా తప్పించిన అగ్రరాజ్యం
యాక్టింగ్ ఆర్మీ చీఫ్ జనరల్‌గా క్రిస్టోఫర్ లానీవ్ నియామకం
ఇరాన్‌పై యుద్ధం వేళ రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ సంచలన నిర్ణయం
ఏడదిలోనే డజనుకు పైగా ఉన్నత స్థాయి జనరల్స్, అడ్మిరల్స్‌పై వేటు
వాషింగ్టన్, ఏప్రిల్ 3 : ఇరాన్‌లో మార్పు తెస్తామని యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా, తమ మాట వినకపోతే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని హెచ్చరిస్తోంది. తమ షరతులకు ఎట్టిపరిస్థితుల్లో తలొగ్గాల్సిందేనని, లేకుంటే దాన్ని రాతియుగానికి పంపు తామంటున్న అమెరికా.. ఇరాన్‌లో ఏమో గానీ సొంత దేశంలోనే అనేక మార్పులు చేసుకుంటోంది. ట్రంప్ కేబినెట్ నుంచి ఇప్పటికే హోమ్ లాండ్ సెక్రటరీ క్రిస్టీ నోయమ్, అటార్నీ జనరల్ పామ్ బాండీలను పదవుల నుంచి తొలగించగా తాజాగా అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను బలవంతంగా పదవి నుంచి తప్పించి, స్వచ్ఛంద పదవీ విరమణ చేయించింది.
ఈ మేరకు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ(రక్షణమంత్రి) పీట్‌హెగ్ సేత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్మీ చీఫ్ ముందస్తు రాజీనామాచేయాలని హెగ్సెత్ సూచనలు చేయడంతో ఆయన్ను పదవి నుంచి తొలగిస్తూ అమెరికా రక్షణ విభాగం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెగ్సెత్ నిర్ణయంతో పెంటగాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాండీజార్జ్ స్థానంలో యాక్టింగ్ ఆర్మీ చీఫ్ జనరల్‌గా క్రిస్టోఫర్ లానీవ్‌ను అమెరికా నియమించింది. పశ్చిమాసియాలో యుద్ధం దృష్ట్యా ఈ నిర్ణయం కీలక పరిణామంగా మారింది. జనరల్ రాండీ ఏ జార్జీ తక్షణమే 41వ ఆర్మీ చీఫ్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు.
జనరల్ జార్జి దశాబ్దాల సేవను అమెరికా డిఫెన్స్ డిపార్ట్ మెంట్ పెంటగాన్ ప్రశంసిచింది. ‘ఆయన రిటైర్‌మెంట్‌ను మేము స్వీకరిస్తున్నాం’ అని పెంటగాన్ అధికార ప్రతినిధి సియాన్ పార్నెల్ ప్రకటన చేశారు. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్.. అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను పదవి నుంచి తప్పుకోమన్నారని అమెరికా డిఫెన్స్ వర్గాలు ధృవీకరించాయి. ఆయన స్థానంలో ప్రస్తుతం ఆర్మీ వైస్‌చీఫ్‌గా ఉన్న క్రిస్టోఫర్ లానీవ్ తాత్కాలిక అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తారు. అమెరికా సెనేట్ నుంచి తదుపరి ఆర్మీ చీఫ్‌కు ఆమోదం లభించే వరకూ ఆయన పదవిలో ఉంటారు. ఇక రాండీ జార్జ్ 2023 సెప్టెంబర్‌లో ఆర్మీచీఫ్ జనరల్‌గా బాధ్యతలు చేప ట్టారు. సాధారణంగా నాలుగేళ్ల పాటు ఆయ న పదవిలో ఉండాలి కానీ పలు కారణాలతో ఆయన్ను ఏడాదిన్నరకే పక్కన పెట్టేశారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా ఎజెండాను అమలు చేసే ప్రయత్నంలో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఉన్నత జనరల్స్‌ను, అడ్మిరల్స్‌ను తొలగిస్తూ, రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరం హెగ్సెత్ తొలిసారిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన డజనుకు పైగా ఉన్నత స్థాయి జనరల్స్, అడ్మిరల్స్‌ను తొలగించారు.
ఈ క్రమంలో జార్జ్ తొలగింపు తాజా పరిణామం. పెంటగాన్ నాయకత్వంలో ఇటీవల చోటుచేసు కున్న గందరగోళానికి జార్జ్ తొలగింపు మరింత ఆజ్యం పోసింది. గత ఫిబ్రవరిలో జరిగిన తొలి విడత తొలగింపుల నుంచి జార్జ్ బయటపడ్డారు. అప్పటి నుంచి, డజనుకు పైగా ఇతర అగ్రశ్రేణి సైనిక జనరల్స్, అడ్మిరల్స్ ముందుగానే వారి పదవుల నుం చి తొలగించబడ్డారు. ఆ తొలగింపుల్లో జార్జ్ డిప్యూటీ, ఆర్మీ వైస్‌చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ జేమ్స్ మింగస్ కూడా ఉన్నారు.
ఆయన ఆ పదవిలో రెండేళ్ల లోపే ఉండగా, ట్రంప్ అకస్మాత్తుగా లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టోఫర్ లానె వ్‌ను ఆ పదవికి నామినేట్ చేశారు. దక్షిణ కొరియాలో ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలం పనిచేసిన ఎనిమిదో సైన్యానికి కమాండర్‌గా ఉన్న లానెవ్‌ను ఎంపిక చేసిన తర్వాత, ఆయన హెగ్సెత్‌కు అగ్రశ్రేణి సైనిక సహాయకుడిగా పనిచేస్తున్నారు. యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ పదవిని చేపట్టక ముందు, రాండీజార్జ్ సైన్యానికి వైస్ చీఫ్‌గా పనిచేశారు. సైన్యంలో సీనియర్ నాయకత్వ పాత్రలు చేపట్టక ముందు, బైడెన్ పరిపాలనలో 2021 నుంచి 2022 వరకు ఆస్టిన్‌కు సైనిక సహాయకుడిగా ఉన్నారు.
తొలగింపులో మరికొందరు?
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్, ఆర్మీ సెక్రటరీ డేనియల్ డ్రిస్కాల్, కార్మిక శాఖ సెక్రటరీ లోరీ చావెజ్-డిరెమర్ కూడా ట్రంప్ పరిపాలన నుంచి వైదొలగనున్నారనే వార్త లు వినిపిస్తున్నాయని, విషయాన్ని వైట్ హౌస్ ప్రణాళికల గురించి తెలిసిన వ్యక్తులు తెలిపారని అట్లాంటిక్ గురువారం పేర్కొంది.




