తెలంగాణ భవన్‌ను నాటకాలకు అద్దెకివ్వండి!

14-09-2026 | 05:10am

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఎద్దేవా

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan)బీఆర్‌ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీపై తెలంగాణ మత్స్య అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శలు చేశారు. ఆదివారం గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నేతలు మాక్ అసెంబ్లీ పేరుతో కపట నాటకాలు, డ్రామాలు ప్రదర్శించారని ఎద్దేవా చేశారు.

ఆ కార్యక్రమాన్ని చూస్తే జబర్దస్త్ కామెడీ షో కూడా దిగదుడుపేనని, ఇకపై తెలంగాణ భవన్‌ను నాటకాలకు అద్దెకివ్వడం మంచిదని వ్యాఖ్యానించారు. సురభి నాటక కంపెనీలు రంగస్థలం నుంచి సినిమాల వరకు ఎంతోమంది గొప్ప కళాకారులను అందించాయని, అయితే తెలంగాణ భవన్లో బీఆర్‌ఎస్ నేతలు ప్రదర్శించిన నటన వాటన్నింటినీ మించిపోయిందని సాయికుమార్ అన్నారు.

కేటీఆర్, హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, తలసాని తదితరులకు ‘నవరస సార్వభౌమ’, ‘కళా ప్రపూర్ణ’, ‘కళా తపస్వి’ వంటి బిరుదులు సరిపోతాయని అన్నారు. వచ్చే ఏడాది వారందరికీ ‘గద్దర్ అవార్డులు’ ఇవ్వాల్సిందేనని సెటైర్ వేశారు. వినాయక చవితి, దసరా నవరాత్రుల్లో వీధి నాటకాలు వేసుకోవడానికి తెలంగాణ భవన్ను అద్దెకిస్తే సరిపోతుందని సాయికుమార్ సూచించారు.

ఇచ్చట నాటకాలు వేయబడును.. కపట నాటక సూత్రాలు నేర్పబడును.. నాటకాలకు భవనం అద్దెకు ఇవ్వబడును అంటూ బోర్డు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి అసెంబ్లీ సంప్రదాయాలను తుంగలో తొక్కారని, ప్రతిపక్షాలను అసెంబ్లీలో మాట్లాడనివ్వని వారు ఇప్పుడు సభా సంస్కృతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.

బీఆర్‌ఎస్‌కు ఉన్న 35 మంది ఎమ్మెల్యేల్లో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని కేవలం ఐదుగురు మాత్రమే కోరుకుంటున్నారని, మిగిలిన 30 మంది రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనను సమర్థిస్తున్నారని సాయికుమార్ పేర్కొన్నారు. నిన్నటి మాక్ అసెంబ్లీలో కేవలం పది మంది ఎమ్మెల్యేలే ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. 


మరిన్ని వార్తలు