కాళేశ్వరానికి మరమ్మతులు
- మూడు బరాజ్‌లను త్వరగా వినియోగంలోకి తేవాలి
- ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలి
- అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
- సమీక్షలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కాళేశ్వరంలోని మూడు బరాజ్‌లకు తక్షణమే మరమ్మతులు చేసి, వీలైనం త త్వరగా వినియోగంలోకి తీసుకురావాల ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు. వీలైనంత త్వరగా ఈ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి, నిరంతరం పర్యవేక్షణ చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని ఆయన సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని సీఎం స్పష్టం చేశారు.
నీటిపారుదల శాఖ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్స్‌తో టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలో మీటర్ల బ్యారేజ్‌ని అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తొవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా ఈ పని పూర్తిచేయాలని ఆదేశించారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్‌లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబరు వరకు చేయాల్సిన పనులపైన పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలన్నారు. పనులలో జాప్యం జరగడానికి వీలు లేదన్న సీఎం, నిధుల విషయంలో ఇబ్బంది కలుగనివ్వబోమని స్పష్టం చేశారు.
మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభం అయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమా వేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, సీఎం కార్యదర్శి మానిక్‌రాజ్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




