గురుకులాల్లో ఎలుకల రాజ్యం!

26-09-2026 | 05:40am

విద్యార్థినులను కొరికిన మూషికాలు

జనగామ జిల్లా పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో ఘటన

పాఠశాల ఎదుట మాజీమంత్రి ఎర్రబెల్లి ఆందోళన

మహబూబాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాలికలకు నాణ్యమైన విద్యతోపాటు సురక్షితమైన వసతి, పౌష్టికాహారం, మెరుగైన వాతావరణాన్ని కల్పించాల్సిన గురుకుల పాఠశాలల్లో నిర్వహణ లోపాలు విద్యార్థినులకు శాపంగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల(Social Welfare Girls Gurukul School)లో మంగళవారం రాత్రి 14 మంది విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రించిన పిల్లలు ఉదయం లేచి చూసేసరికి చేతి, కాలు వేళ్లకు గాయాలైన ఘటనతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ వరలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లగా ఆమె స్పందించి వెంటనే విద్యా ర్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు.

ఈ సంఘటనతో బాలికల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెల కొంది. కాగా విద్యార్థినులు ప్రశాంతమైన వా తావరణంలో చదువుకోవాల్సిన గురుకుల ప్రాంగణంలో ఎలుకల బెడద తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎలుక కాటు చిన్న విషయం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాయానికి తక్షణ వైద్య పరీక్ష, అవసరమైన చికిత్స, వైద్యుల సూచన మేరకు తదుపరి పర్యవేక్షణ అవసరం.. ముఖ్యంగా వసతి గృహంలో పదుల సంఖ్యలో బాలికలు కలిసి నివసిస్తున్న నేపథ్యంలో ఒకరి తర్వాత మరొకరికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొంటున్నారు.

తమ పిల్లలను నమ్మకంతో గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రులకు అక్కడి వసతి పరిస్థితులు భరోసా కలిగించేలా ఉండాలి.. పిల్లలు చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఎలుకల భయంతో రాత్రిళ్లు సరిగా నిద్రపోలేని పరిస్థితి ఏర్పడితే అది విద్యపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.

బాలికల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.గురుకుల విద్యాలయంలో పలువురు విద్యార్థులను ఎలుక లు కొరికిన ఘటన నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి వెళ్లగా ఆయన్ని   పోలీసులు అడ్డుకోవడంతో పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకు ండా చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ కార్యదర్శికి ఫోన్‌లో డిమాండ్ చేశారు.

ఉద్యోగాల నుంచి కేజీబీవీ ఎస్‌ఓ, సీఆర్‌టీల తొలగింపు

ఇక మహబూబాబాద్ జిల్లా నేరేడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(Kasturba Gandhi Balika Vidyalaya)లో వినాయక చవితి సందర్భంగా డార్మెటరీలో ఏర్పాటు చేసుకున్న గణనాథుడి వద్ద దీపం వెలిగించిన సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంగ్లీషు సీఆర్‌టీ ఏడవ తరగతికి చెందిన పలువురు విద్యార్థినులను కొట్టారు.  విషయం బయటకు పొక్కడంతో ల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై విచారణ జరిపిన అధికారులు పాఠ శాల ఎస్‌ఓ సరస్వతి, సీఆర్‌టీ సుహాసినిలకు షోకాజు నోటీసు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం వారిని ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికినట్లు జీసీ ఈవోగాయత్రి తెలిపారు. 

మరిన్ని వార్తలు