4 March, 2026 | 5:19 AM

నార్ముల్‌కు పూర్వ వైభవం తెస్తాం

04-03-2026 12:00 AM

మదర్ -డైయిరీ పరిరక్షణ కోసమే ఎన్డీడీబీతో ఒప్పందం 

28వ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి 

నష్టాలపై చైర్మన్, మాజీ చైర్మన్ల మధ్య వాదోపవాదాలు 

సర్వసభ్య సమావేశంలో ఒప్పందంపై తీర్మానం 

ఎల్బీనగర్, మార్చి 3:  హయత్‌నగర్‌లోని నల్లగొండ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్)కు పూర్వ వైభవం తెస్తామని, డెయిరీ అభివృద్ధి కోసమే ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకున్నామని చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఎన్డీడీబీ సహకారంతో ప్రత్యేక నిధులు వెచ్చించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను పక్షం రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం  హయత్‌నగర్‌లోని మదర్ డైయిరీ సమీపంలో ఓ ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్ లో 28వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

సమావేశానికి పాలకమండలి సభ్యులు, మాజీ చైర్మన్లు, పాల సంఘాల రైతులు పాల్గొన్నారు. సమావేశంలో చైర్మన్, మాజీ చైర్మన్ల మధ్య స్వల్ప వివాదంతోపాటు రైతులు సైతం తమకు బిల్లులు చెల్లిం చాలని పట్టుబడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 350 మంది పాల సహకార సంస్థల చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.... తాను  చైర్మన్‌గా ఉన్న కాలంలో సంస్థను అభివృద్ధి చేశానని, ఇప్పు డు ఎలా నష్టాల్లో ఉందన్నారు. 

అనంతరం చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను పదవి ఆకాంక్షతో ఈ పదవి చేపట్టలేదని, రైతుల సంక్షేమానికి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నానని పునరుద్ఘాటించారు. మదర్ డైయి రీలో అనధికారిక ఉద్యోగస్తుల నియామకమే పెద్ద భారంగా మారిందని, ఉద్యోగ స్తుల నియామకం ఏ ప్రాతిపదికన చేపట్టారని? మాజీ చైర్మన్లను ప్రశ్నించారు.

డైయిరీ అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య సహకారంతో ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.  రైతులకు చెల్లించాల్సిన బకాయిల కోసం వెంటనే రూ, 10 కోట్లు ఇవ్వమని ఎన్డీడీబీని కోరినట్లు చెప్పారు. ఒప్పందంతో ఎలాంటి నష్టం లేదని మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.  నార్ముల్ పాలకవర్గం ద్వారా పాల సేకరణ చేయాలని, మార్కెటింగ్ తాము చూసుకుంటామని కండీషన్స్ పెట్టారన్నారు.

త్వరలో ఎన్డీడీబీ అధికారుల బృందాన్ని పంపించి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని చైర్మన్ వివరించారు. సమావేశంలో నార్ముల్ ఎండీ కాటిపల్లి లింగారెడ్డి,  బోర్డు డైరెక్టర్లు జయశ్రీ, ఉప్పల్ వెంకట్ రెడ్డి, జలందర్ రెడ్డి, అలివేలు రంగారెడ్డి, పుప్పాల నర్సింహులు, కస్తూరి పాండు, సందిల భాస్కర్ గౌడ్, ఎండీ కాటిపల్లి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.