విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి
హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సమస్యలను గాలికి వదిలేసారని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. మంగళవారం రోజున హనుమకొండ లోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Kakatiya Government Degree College) నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు దగ్గర కి వస్తున్న కూడా ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, కోర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులు సొంత డబ్బులు కట్టి సర్టిఫికెట్స్ తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాకతీయ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సరిపడ తరగతి గదులు భవనాలు లేకపోవడంతో ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్ వైస్ గా ఉండడంవల్ల డిగ్రీ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ చదువుకోవలసి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా పేరుపొందిన కేడీసీ లో ఇలాంటి ఇబ్బందులు ఉండడం చాలా బాధాకరమన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే కాకతీయ డిగ్రీ కళాశాల కు నూతన భవనాలను నిర్మించాలన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్,ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.