calender_icon.png 1 November, 2024 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్ హక్కు కానుక కాదు

12-05-2024 02:51:47 AM

హైకోర్టు కీలక తీర్పు వెల్లడి

తెలుగు అకాడమీల కేసులో ఉత్తర్వులు

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): పెన్షన్ ఉచితం కాదని, అది వారి హక్కు అని హైకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్ర విభజన తరువాత పదవీ విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇవ్వాల్సిన పింఛన్ బకాయిలను రెండు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. పదవీ విరమణ ప్రయోజనాలను అందించాల్సిందేనని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.

తెలుగు అకాడమీ విభజన తరువాత ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగులకు చెందిన సర్వీసు రికార్డులను పరస్పరం పంపించుకోవలని కోరింది. ఆ తర్వాత 2 వారాల్లోగా వాళ్లకు పెన్షన్ బకాయిలను చెల్లించాలని సూచించింది. చివరి దశలో ఉన్న పెన్షనర్లు 6 శాతం వడ్డీకి అర్హులని పేర్కొంది. తీర్పు అమలు నివేదిక పరిశీలన నిమిత్తం విచారణను జూన్ 27కి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ ఎన్ తుకారాంజీల ధర్మాసనం ప్రకటించింది. 

2022 మే 1న విభజన.. 

ఉమ్మడి ఏపీలోని తెలుగు అకాడమీ 2022 మే 1న విభజన జరగ్గా పదవీ విరమణ చేసిన తమకు పూర్తిస్థాయి పెన్షన్ అందించకపోవడంతో బీ వరలక్ష్మితో సహా ఏపీ, తెలంగాణకు చెందిన 15 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలుగు అకాడమీకి చెందిన కొందరు ఉద్యోగుల విభజనపై 2021లో ఇదే హైకోర్టు తీర్పు వెలువరించగా, తెలంగాణ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో రెండు రాష్ట్రాల అకాడమీల అధికా రులు మార్గదర్శకాలు రూపొందించి ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం ప్రస్తుత పిటిషనర్లలో 11 మంది తెలంగాణకు, నలుగురు ఏపీకి కేటాయింపు జరగ్గా, వారి స్థానికత ఆధారంగా పెన్షన్ చెల్లించాలని ఒప్పందం కుదిరింది. ఒప్పందం గురించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఒప్పందాన్ని అమలు చేస్తామని బేషరతుగా ఎస్‌ఎల్పీని ఉపసంహరించుకుంది. ఇరుపక్షాల వాటాల గురించి తాము పరిశీలిం చడంలేదని, పెన్షన్ చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చి అమలు చేయకపోవడం విచారకరమన్నారు.

ఎస్సెల్పీని బేషరతుగా ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం భిన్నంగా నిర్ణయం తీసుకోరాదని సూచించింది. రెండు వారాల్లో రికార్డులు పంపాలని, మరో రెండు వారాల్లో పెన్షన్ లెక్కించి చెల్లించాలంది. ఈ ఉత్తర్వుల అమలు నివేదికను జూన్ 24లోగా రిజిస్ట్రార్కు సమర్పించాలని, నివేదిక పరిశీలన నిమిత్తం విచారణను జూన్ 27వ తేదీకి వాయిదా వేసింది.