కాలుష్యం గ్రామాలకు.. సీఎస్‌ఆర్ నిధులు పక్కకు!
హత్నూర మండలంలో పరిశ్రమల విస్తరణ
పెరుగుతున్న కాలుష్యం, అనారోగ్య బాధితులు
కాలుష్య కోరల్లో చిక్కుకున్న 12 గ్రామాలు
హత్నూర (సంగారెడ్డి), సెప్టెంబర్ 25: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) హత్నూర మండలం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ అభివృద్ధి స్థానిక గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారుతోంది. పరిశ్రమల స్థాపన కోసం విలువైన భూములు, అమూల్యమైన భూగర్భ జలాలు, రహదారులు తదితర స్థానిక వనరులను కంపెనీలు యథేచ్ఛగా వినియోగించుకుంటున్నాయి.
అయితే వాటి నుంచి వెలువడే ప్రమాదకర రసాయన వ్యర్థాలు(Chemical waste), విషవాయువులు, కాలుష్య దుష్ప్రభావాలను మాత్రం ఇక్కడి ప్రజలే నిత్యం భరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు తమ లాభాల నుంచి చట్టబద్ధంగా ఖర్చు చేయాల్సిన కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు ఎటు పోతున్నాయనే ప్రశ్న మండలవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాలుష్యం మాత్రం స్థానికులకు ఇచ్చి, సీఎస్‌ఆర్ నిధులను మాత్రం ఇతర ప్రాంతాలకు తరలించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది.
పక్కదారి పడుతున్న సీఎస్‌ఆర్ నిధులు..
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, కంపెనీల చట్టంలోని సెక్షన్ 135 కింద సీఎస్‌ఆర్ నిధులను ఖర్చు చేసేటప్పుడు కంపెనీలు తాము పనిచేస్తున్న స్థానిక ప్రాంతాలు, ప్రభావిత పరిసర గ్రామాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంగా నిర్దేశించింది.
అయితే ఈ నిబంధనను స్థానిక పరిశ్రమలు తుంగలో తొక్కుతున్నాయి. స్థానిక ప్రాధాన్యత అనేది చట్టపరంగా తప్పనిసరి భౌగోళిక పరిమితి కాదు అనే వెసులుబాటును అడ్డం పెట్టుకుని, లాభాలు ఆర్జిస్తున్న హత్నూర ప్రాంతాన్ని గాలికొదిలేసి తమ అనుకూలమైన ప్రాంతాలకు, కార్పొరేట్ పెద్దల ఆదేశాల మేరకు దూరప్రాంతాలకు నిధులను మళ్లిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాలుష్య కోరల్లో గ్రామాలు..
హత్నూర మండల పరిధిలో గుండ్లమాచునూరు, పల్పనూర్, బోరపట్ల, చందా పూర్, మల్కాపూర్, తుర్కల్ ఖానాపూర్, ముచ్చర్ల, వడ్డేపల్లి, చింతలచెరువు, నస్తీపూర్, కాసాల, గోవింద్రాజ్పల్లి తదితర గ్రామాల్లో 15కు పైగా భారీ ప్రైవేట్ పరిశ్రమలు నిరంతరం కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పరిశ్ర మల నుంచి వెలువడే వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితమై తాగేందుకు గుక్కెడు మంచినీరు దొరకని దుస్థితి ఏర్పడింది.
కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఈ గ్రామాల్లో కనీస రహదారులు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రాథమిక వైద్య సదుపాయాల కల్పనకు ఈ సీఎస్‌ఆర్ నిధులను వినియోగించాల్సి ఉండగా.. యాజమాన్యాలు మొండిచేయి చూపుతున్నాయి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ పరిశ్రమల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి సీఎస్‌ఆర్ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని ఆయా గ్రామాల సర్పంచ్లు, ప్రజలు కోరుతున్నారు.