24 July, 2026 | 6:23 PM

మానవసేవే మాధవసేవ

24-07-2026 05:50 PM

ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సర్పంచ్ మందా నాగరాజు

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక శ్రీరాంపురం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బూర్గంపాడు సర్పంచ్ మందా నాగరాజు మానవత్వాన్ని చాటుకున్నారు. అశోక్ లేలాండ్ ట్రాలీని ఓ లారీ ఢీకొట్టడంతో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో అశోక్ లేలాండ్ డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

అదే మార్గంలో వెళ్తున్న సర్పంచ్ మందా నాగరాజు వెంటనే స్పందించి అశోక్ లేలాండ్‌పైకి ఎక్కి, స్థానికుల సహాయంతో డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు.సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను రక్షించేందుకు ముందుకు వచ్చిన సర్పంచ్ మందా నాగరాజును స్థానికులు అభినందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.