22 May, 2026 | 5:48 PM

ఆదివాసీ గ్రామాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలి

22-05-2026 05:06 PM

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ఆదివాసి గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు పెంచినట్లు ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవానికి పలు కేటగిరీల కార్మికుల వేతనాలు తగ్గిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. బేసిక్ వేతనాల ఆధారంగా వేతనాలను పెంచాలని కోరారు.

జిల్లాలో వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం అందడం లేదని, ఉపాధి హామీ పనుల వద్ద తాగునీరు, మెడికల్ కిట్, టెంట్ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా 60 గ్రామాల్లో సౌకర్యాలు కల్పించారని, మిగతా గ్రామాల్లోనూ వెంటనే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారుల వేధింపులు పెరిగాయని, రెవెన్యూ మరియు అసైన్డ్ భూములపై కూడా ఒత్తిళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు.

భూముల రక్షణ కోసం ఆదివాసీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.జిల్లాలోని అనేక ఆదివాసీ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వెంటనే తాగునీటి సౌకర్యాలు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి రిఫరల్ ఆసుపత్రిగా మారిపోయిందని, పరికరాలు ఉన్నప్పటికీ వైద్యులు, సాంకేతిక సిబ్బంది కొరతతో ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందడం లేదన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాన్ని పోలీసు శాఖకు కేటాయించడంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని, మైదానాన్ని తిరిగి క్రీడాకారుల వినియోగానికి అందుబాటులోకి తేవాలని కోరారు.త్వరలో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యమంత్రి పర్యటన జిల్లా ప్రజలకు భరోసానిచ్చేలా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం దినకర్ , సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్ కుమార్, గోడిసెల కార్తీక్, జె. రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.