నటి ట్విషా శర్మ కేసులో మరో కీలక పరిణామం.. డెడ్ బాడీకి రీ పోస్ట్‌మార్టం
భోపాల్: మాజీ మిస్ పుణె, టాలీవుడ్ నటి ట్విషా శర్మ ఆత్మహత్య కేసులో(Twisha Sharma death case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్విషా శర్మ మృతదేహానికి రెండవ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో పోస్టుమార్టం జరిపించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ట్విషా(Twisha Sharma Case) మృతి కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించింది.
వరకట్న వేధింపుల వల్లే ట్విషా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. భోపాల్‌లోని తన అత్తగారి ఇంట్లో ఆమె మరణం కేవలం ఆత్మహత్య కాదని, దీనికి లోతైన ఫోరెన్సిక్ పరిశీలన అవసరమని నిరంతరం వాదిస్తున్న ట్విషా కుటుంబానికి ఈ ఉత్తర్వుతో భారీ ఊరట లభించింది. న్యాయవాది అయిన సమర్థ్ సింగ్‌తో వివాహం జరిగిన కేవలం ఐదు నెలలకే నటి ట్విషా మే 12న మరణించి కనిపించింది. ఆమె 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా అతన్ని కలిసింది. వారు 2025 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు.






