27 June, 2026 | 1:13 AM

మంచిర్యాలలో 2కే రన్

27-06-2026 12:12 AM
  1. గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం కీలకం
  2. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్

మంచిర్యాల క్రైమ్, జూన్ 26 : అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలో శుక్ర వారం 2కే రన్ నిర్వహించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించే ఉద్దేశంతో రన్ ని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సమాజానికి మహమ్మారిగా మారుతున్నాయని, ముఖ్యంగా యువత వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో నిరంతరం కృషి చేస్తుందన్నారు.

మాదకద్రవ్యాలకు బానిసైన వారి కోసం డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందుబాటులో ఉంచామన్నారు. డ్రగ్స్ అక్రమరవాణా, విక్రయాలకు పాల్ప డే పెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్కు ’నో’ చెప్పి.., జీవి తానికి ఎస్ చెప్పాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో 13వ బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పట్టణ సీఐ ప్రమోద్రావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసులు, యువతవిద్యార్థులు పాల్గొన్నారు.