27 June, 2026 | 1:30 AM

హరిత సంకల్పం!

27-06-2026 12:19 AM
  1. సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 20 లక్షల మొక్కలే లక్ష్యం
  2. ప్రత్యేక ఆకర్షణగా మహిళా వనోత్సవం
  3. మహిళా సంఘాలకు బాధ్యతలు 

సంగారెడ్డి, జూన్ 26(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమం కింద ఈ ఏడా ది మొత్తం 20 లక్షల మొక్కలు నాటాలని జిల్లా అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక అడవుల పెంపకమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. 

జిల్లాలో నిర్దేశించుకున్న 20 లక్షల మొక్కల లక్ష్యాన్ని విజయవంతం చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖలకు బాధ్యతలను అప్పగించారు. జిల్లాలోనే అత్యధికం గా 10.50 లక్షల మొక్కలను నాటే బాధ్యత ను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపా లిటీల పరిధిలో కలిపి 3.20 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు.

అడవుల పునరుజ్జీవనం, ఖాళీ ప్రదేశాలలో లక్షలాది మొక్కల పెంపకానికి అటవీశాఖ ప్రణాళిక సిద్ధం చే సింది. జిల్లా వ్యాప్తంగా 50 వేల మొక్కలను నాటడమే లక్ష్యంగా ఉద్యానవన శాఖ పెట్టుకుంది.  జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలు, టీజీఐఐసీ భూముల్లో పెంచేందుకు ప్రత్యేకంగా మొక్కలు నాటనున్నారు. 

ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మహిళా వనోత్సవం..

ఈ ఏడాది వనమహోత్సవంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలను ఇందులో పెద్ద ఎత్తు న భాగస్వాములను చేస్తున్నారు.  గ్రామ మ హిళా సమాఖ్యల ద్వారా ప్రతి పొదుపు సం ఘం మహిళకు 3 నుంచి 4 మొక్కలను పం పిణీ చేయనున్నారు. కేవలం అలంకార ప్రా యమైనవి కాకుండా.. నిత్య జీవితంలో ఉపయోగపడే దానిమ్మ, సపోట, కరివేపాకు, జామ వంటి మొక్కలను కేటాయిస్తున్నారు.  

నర్సరీల సన్నద్ధత...

వర్షాకాలం ప్రారంభానికి ముందే జిల్లాలోని నర్సరీలలో అవసరమైన మొక్కలను అధికారులు సిద్ధం చేశారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ, ఆశించిన స్థాయిలో విస్తారంగా వర్షాలు కురవకపోవడంతో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మొక్కలు నాటే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. వర్షాలు పుంజుకోగానే ఈ డ్రైవ్ను మరింత వేగవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి, గ్రామ సంఘాల ప్రతినిధులకు ఉన్నతాధికారులు నిరంతరం దిశానిర్దేశం చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటి మనుగడ రేటును పెంచడంపై ఈ సారి అధికారులు ఎక్కువ దృష్టి పెట్టారు. మహిళా సంఘాల భాగస్వామ్యం వల్ల ఇంటి వద్ద నాటే మొక్కల సంరక్షణ బాధ్యత మెరుగ్గా ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు. పారిశ్రామిక, బహిరంగ ప్రదేశాలలో నాటే మొక్కలకు రక్షణగా ట్రీ గార్డుల ఏర్పాటు, క్రమం తప్పకుండా నీరు పెట్టేలా ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.