సమగ్ర దృక్పథాన్ని సంధించాలి
అప్పుడే ప్రపంచ సవాళ్లను ఎదుర్కోగలం
చమురు ఓడలకు కొత్త బీమా యంత్రాంగం ఉండాలి
బ్రిక్స్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: తీవ్రమైన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో సమగ్ర దృక్పథాన్ని సంధించాలని, అవలంబించాలని బ్రిక్స్(BRICS) దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin) పిలుపునిచ్చారు. చమురు రవాణా చేసే ఓడలకు ఒక కొత్త బీమా యంత్రాంగం ఉండాలని, ధాన్యం మార్కెట్ కోసం కూడా ఒక సహకార వ్యవస్థ ఉండాలని ప్రతిపాదించారు.
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మాస్కోపై పాశ్చాత్య శక్తులు విధించిన తీవ్రమైన ఆంక్షల మధ్య, బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వృద్ధి కోసం పుతిన్ ఈ కొత్త కార్యక్రమాలను ప్రతిపాదించారు ‘మూలధనం, శ్రమ, సాంకేతికతలను తరలించడానికి మాకు స్వతంత్ర మార్గాలు ఉన్నాయి. వాస్తవానికి, బాహ్య ఒత్తిడితో సంబంధం లేకుండా మేము పనిచేయగలం’ అని అన్నారు. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సు ముగింపు సమావేశంలో ఆదివారం ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘భీమా యంత్రాంగాన్ని, ధాన్యం మార్కెట్‌ను సృష్టించడం వంటి కొన్ని ఆశాజనకమైన కార్యక్రమాలు మా వద్ద ఉన్నా యి. ఇవి రష్యా ప్రతిపాదనలు, వాటిని ఉపయోగించుకోవాలని మేము అన్ని ఇతర సభ్య దేశాలను ఆహ్వానిస్తున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు.
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) పనితీరును కూడా పుతిన్ ప్రశంసించారు. అది 140 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తోందని అన్నారు. ప్రపంచ సవాళ్లు తలెత్తుతూనే ఉన్నందున, వాటి లక్షణాలను, మూల కారణాలను పరిష్కరించడానికి మనం సమగ్ర విధానాన్ని అవలంబించాలని పుతిన్ అన్నారు. ‘గ్లోబల్ సౌత్ దేశాలు కలిసి మెరుగైన (ప్రపంచ) పాలనా నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని, సాంప్రదాయ, అసాంప్రదాయ భద్రతా ముప్పులను ఎదుర్కోవాలని తెలిపారు. తీవ్రమైన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక స్వతంత్ర మార్గాన్ని రూపొందించడంపై బ్రిక్స్ దృష్టి సారిస్తున్నందున, దాని ప్రపంచ స్థాయి పెరుగుతోందని రష్యా అధ్యక్షుడు అన్నారు.