సచిన్‌కు పసిడి
వరల్డ్ పారా అథ్లెటిక్స్ టోర్నీ
కోబె (జపాన్): ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ సచిన్ సర్జేరావు కిలారీ రికార్డు స్థాయి ప్రదర్శనతో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల షాట్ పుట్ ఎఫ్ 46 కేటగిరీలో సచిన్ ఇనుపగుండును 16.30 మీటర్ల దూరం విసిరి స్వర్ణం అందుకున్నాడు. గతంలో 16.21 మీటర్లతో తన పేరిటే ఉన్న రికార్డును సచిన్ తాజాగా బద్దలుకొట్టాడు. ఈ చాంపియన్‌షిప్‌లో తెలంగా ణ అథ్లెట్ దీప్తి జివాంజితో పాటు సుమిత్, తంగవేలు మరియప్పన్, ఏక్తా భ్యాన్‌లు ఇప్పటికే స్వర్ణాలు గెలవగా.. తాజాగా సచిన్ ఈ జాబితాలో చేరాడు. ఇక పురుషుల ఎఫ్ 51 క్లబ్ త్రో విభాగంలో భారత పారా అథ్లెట్ ధరమ్‌బీర్ వుడెన్ క్లబ్‌ను 33.61 మీటర్లు విసిరి కాంస్యం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో 12 పతకాలు (5 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు) వచ్చి చేరాయి. గతంలో ఈ టోర్నీలో భారత్ 10 పతకాలు సాధించగా.. తాజాగా 12 పతకాలతో మన పారా అథ్లెట్లు ఆ రికార్డును కూడా చెరిపేశారు.






