18-02-2026 01:19:26 AM
నూతన సర్పంచులకు రెండవ విడత శిక్షణలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 17,(విజయక్రాంతి): గ్రామాల సమగ్రాభివృద్ధిలో గ్రామపంచాయతీ సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న నిధులను నియమ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా వినియోగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సర్పంచులకు పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక రెండవ విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఎస్‌ఎం ఓల్ క్యాంపస్)లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 471 మంది గ్రామపంచాయతీ సర్పంచులకు విడతల వారీగా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రెండవ విడత శిక్షణ కార్యక్రమం ఈనెల 17 నుండి 21 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. 2వ విడతలో భాగంగా అశ్వరావు పేట, దమ్మపేట, దుమ్ముగూడెం, ములకలపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లందు, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన 233 మంది నూతన సర్పంచులు శిక్షణలో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పాలన, పరిపాలన విధానాలు, బాధ్యతలు, కర్తవ్యాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ శిక్షణ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అన్నారు. శిక్షణలో భాగంగా పంచాయతీ రాజ్ చట్టం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతలు, పారదర్శక పాలన అంశాలపై సవివరంగా మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గ్రామ పంచాయతీలకు అందుతున్న అభివృద్ధి పథకాల నిధులను సక్రమంగా వినియోగించి తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వీధిదీపాలు, విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ టాయిలెట్లు వంటి వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీపీఓ సుధీర్, శిక్షణ డీపీఓ అనూష, డీఎల్పీఓలు ప్రభాకర్, రమణ, టీజీఐఆర్టీ సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్, ట్రైనర్లు బన్సింగ్, రవీందర్ రెడ్డి, సునీల్ కుమార్, ముత్యాలరావు, హజ్రత్ వలి, ఏపీవో రంగ, ఎస్బీఎం రేవతి, డిటిఎం సందీప్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.